విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పుకు కోపం లాగ తయారైంది చంద్రబాబునాయుడు పరిస్ధితి. ప్రచారానికి వస్తే కెసియార్ తో తంటాలు. రానంటే తెలంగాణాలో తమ్ముళ్ళు ఒప్పుకోవటం లేదు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

ముందస్తు ఎన్నికలు అన్నీ పార్టీల్లోనూ రాజకీయంగా బాగా వేడిపుట్టిస్తున్నాయ్. ఒక్కో పార్టీలో ఒక్కోరకంగా మంటలు పుట్టిస్తున్నాయి. ఇటువంటి నేపధ్యంలో మహాకూటమిలో అందరికీ ఓ సందేహం మొదలైంది. తెలంగాణాలో జరుగనున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారానికి వస్తారా ? ఇపుడిదే ప్రశ్న తెలుగుదేశంపార్టీ నేతలను బలంగా పట్టి పీడిస్తోంది. ఎందుకంటే, నేతలేమో చంద్రబాబును ప్రచారానికి రావాలని పట్టుపడుతున్నారు. చంద్రబాబుకు తాను రాకపోవటమే కాదు తన పుత్రుడు చినాబాబు నారా లోకేష్ ను పంపాలని కూడా లేదు.

 

మామూలుగా అయితే చంద్రబాబుకు మైక్ దొరికితే వదలరు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. నేతలు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కావచ్చు, పార్టీ సమావేశాలు కావచ్చు లేదా బహిరంగసమావేశాలు కూడా కావచ్చు. అందుకే చంద్రబాబును పార్టీలో కూడా ముద్దుగా మైకాసురుడు అని పిలుచుకుంటుంటారు. అటువంటి చంద్రబాబు ఎన్నికల సభల్లో మాట్లాడే అవకాశం వస్తే వదులుకుంటారా ? కానీ విచిత్రంగా తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో ప్రచారానికి రావాలని చంద్రబాబు అనుకోవటం లేదు.

 

తెలంగాణాలో ప్రచారానికి తాను రావటం లేదని గతంలోనే చంద్రబాబు నేతలకు స్పష్టం చేసేశారు. తెలంగాణాలో ప్రచారానికి చంద్రబాబు ఎందుకు ఇష్టపడటం లేదన్న ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. కెసియార్ తో వైరం కారణంగానే తెలంగాణాలో ప్రచారానికి చంద్రబాబు వెనకాడుతున్నారు. కెసియార్ తో వైరం ఎందుకంటే ఓటుకునోటు కేసులో అడ్డంగా తగులుకోవటమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందస్తు ఎన్నికలకు తెర లేచిన దగ్గర నుండి టిఆర్ఎస్ చీఫ్  ‘ ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు’ అంటూ కెసియార్ విరుచుకుపడుడతున్న విషయం తెలిసిందే.

 

ఎన్నికల ప్రచార సభల్లో కెసియార్ అంత అసభ్యంగా, నేరుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా గట్టిగా సమాధానం చెప్పే ధైర్యం కూడా చేయటం లేదు చంద్రబాబు.  అదికూడా అమరావతిలో కూర్చునే సుమా. అటువంటిది తెలంగాణా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారా ? చంద్రబాబు ఇబ్బందులను పట్టించుకోకుండా నేతలేమో ఒకటే ఒత్తిడి పెడుతున్నారు. దాంతో విషయాన్ని నేరుగా చెప్పలేక చంద్రబాబు అవస్తలు పడుతున్నారు. పోనీ లోకేష్ అయినా వస్తారా అంటే అదీ కుదరదని అంటున్నారు చంద్రబాబు.


ఈరోజు చంద్రబాబు అధ్యక్షతన తెలంగాణా టిడిపి పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతోందట. మిగిలిన నియోజకవర్గాల సంగతెలాగున్నా కనీసం తెలుగుదేశంపార్టీ అభ్యర్ధుల ప్రచారానికైనా రావాల్సిందేనంటూ టి నేతలు బాగా పట్టుబడుతున్నారు. ఒక నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు రాలేరు. ప్రచారానికి వస్తే కెసియార్ నే టార్గెట్ చేయాలి. కెసియార్ ను టార్గెట్ చేస్తే ఇంకేమన్నా ఉందా ?


మరింత సమాచారం తెలుసుకోండి: