కాంగ్రెస్‌ పార్టీ అంటేనే ఓ కలగూర గంప. ఇక్కడ ఏ మాత్రం క్రమశిక్షణ ఉండదు. ఈ పార్టీని నమ్ముకుని సుదీర్ఘ‌ కాలంగా రాజకీయాలు చేసి నిండా మునిగినవారు సైతం ఉన్నారు. ఎవరికీ స్పష్టమైన హామీ ఉండదు. పార్టీని నమ్ముకుని పని చేసినా సీటు వస్తుందన్న గ్యారెంటీ లేదు. మామూలు పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌లో పొజిషన్‌ ఇలా ఉంటే... ఇక ప్రస్తుతం తెలంగాణలో మహాకూటమితో కలిసి కాంగ్రెస్‌ ఎన్నికలు ఎదుర్కొంటోంది. అధికార టీఆర్‌ఎస్‌ను ఎలాగైనా గద్దె దింపాలన్న టార్గెట్‌తో కాంగ్రెస్‌ తనతో పాటు సీపీఐ, తెలంగాణ జనసమితితో పాటు తనకు చిరకాల రాజకీయ శత్రువు అయిన టీడీపీతో సైతం చేతులు కలిపింది. ఈ క్రమంలోనే మిత్రులకు దాదాపు 30 సీట్ల వరకు త్యాగం చెయ్యక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ 30 సీట్లలో గత పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న వారిని ఇప్పుడు పక్కన పెట్టక తప్పని పరిస్థితి. 


కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్‌ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక నిన్నగాక మొన్న టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి వారికి సైతం అక్కడ చుక్కలు కనపడుతున్నాయి. రేవంత్‌ రెడ్డి పార్టీ మారేట‌ప్పుడు తనతో పాటు టీడీపీ నుంచి ఏకంగా ఓ టీమ్‌నే తీసుకు వెళ్లాడు. రేవంత్‌ పార్టీ మారినప్పుడు ఆయన రాహుల్‌ గాంధీని మీట్‌ అయినప్పుడు రేవంత్‌ చెప్పిన వారికి ఏకంగా పది మంది వరకు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామన్న హామీ వచ్చినట్టు వార్తలు జోరుగా హల్‌చల్‌ చేసాయి. అయితే ఇప్పుడు తాజా పరిస్థితులను బట్టీ చూస్తే రేవంత్‌కు ఇచ్చిన మాట నీటి మీద రాతలుగానే ఉన్నట్టు కనిపిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు సంస్థాగతంగా మంచి పట్టుంది. గత ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో ఓడిపోయినా ఈ జిల్లాల్లో పోటీ చేసిన చోట్ల బలంగా ఓట్లు చీల్చుకుంది. 


ఇప్పుడు కేడర్‌ ఉన్నా బలమైన లీడర్లు లేక పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెలకొంది. ఇదే జిల్లాకు చెందిన కొందరు నాయకులు రేవంత్‌ రెడ్డిని నమ్ముకుని ఆయన వెంట హస్తం గూటికి చేరారు. అప్పట్లో వీరంతా తమకు టిక్కెట్లు ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్‌ నుంచి రాజారాం యాదవ్‌, నిజామబాద్‌ రూరల్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే అరికె నర్సారెడ్డి, యల్లారెడ్డి నుంచి సుభాష్‌ రెడ్డి ఈ ముగ్గురు నేతలు టీడీపీలో ఉండి రేవంత్‌ వెంట నడిచారు. ఈ ముగ్గురికి ఆయా సీట్లపై రేవంత్‌ వర్గం కన్నేసింది. రేవంత్‌ కోటాలో తమకు సీటు గ్యారెంటీ అని వీరు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీ సీనియర్లు నుంచి టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో రేవంత్‌ వర్గం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 


టీడీపీలో కొనసాగినా తమకు కూటమి సద్దుబాటులో భాగంగా టిక్కెట్‌ వచ్చేదని ఇప్పుడు రేవంత్‌ను నమ్ముకుని అనవసరంగా పార్టీ మారామని వారు వాపోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్మడి నిజామబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, నిజామబాద్‌ రూరల్‌, యల్లారెడ్డిలలో కాంగ్రెస్‌ సీనియర్లు వర్సెస్‌ వలస నేతల మధ్య‌ టిక్కెట్ల పంచాయితీ షురూ అవుతుంది. జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపీకపై ఓ క్లారిటీ వచ్చినా ఈ మూడు నియోజకవర్గాల్లో మాత్రం పంచాయితీ కొనసాగుతుంది. ఆర్మూర్‌ నుంచి రేవంత్‌ వర్గం నేత రాజారాం యాదవ్‌ టిక్కెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా అటు కాంగ్రెస్‌ నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆకుల లలితకు టిక్కెట్ ఖ‌రారు చేసే పనిలో కాంగ్రెస్‌ అధిష్టానం ఉంది. 


నిజామబాద్‌ రూరల్లో రేవంత్‌ వర్గం నేత అరికెల నర్సారెడ్డికి, టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి మధ్య‌ టిక్కెట్‌ కోసం గట్టి పోటీ ఉంది. అయితే ఇదే నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తే మాజీ మంత్రి మండ‌వ‌ వెంకటేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ సీటు కోసం ఏకంగా ట్ర‌యాంగిల్ ఫైట్ న‌డుస్తోంది. యల్లారెడ్డిలో వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి రేవంత్‌ వర్గం నుంచి టిక్కెట్‌ ఆశిస్తుండగా నల్లమడుగు సురేంద్ర రేసులో ఉన్నారు. అలాగే ఇదే టిక్కెట్‌ కోసం తెలంగాణ జనసమితి సైతం పట్టుపడుతోంది. ఏదేమైనా ఎన్నికల వేల రేవంత్‌ రెడ్డికే కాదు ఆయన్ను నమ్ముకున్న లీడర్ల పరిస్థితి కూడా గందరగోళంలో పడినట్లు అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: