ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య(96) కన్నుమూశారు. విశాఖపట్నంలోని పినాకిని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ(శనివారం) ఉదయం తుదిశ్వాస విడిచారు.  అక్టోబరు 25న అనారోగ్యానికి గురైన జస్టిస్ పున్నయ్యను చికిత్స కోసం విశాఖలోని పినాకిని హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌పై చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో శనివారం మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. 
Image result for justice punnaiah
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలి గ్రామానికి చెందిన పున్నయ్య 1952లో రెండేళ్లపాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, 1955లో చీపురపల్లి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1962లో రాజకీయాలు వదులుకొని హైకోర్టు న్యాయవాదిగా వెళ్లారు. 1974-85 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.

2000 సంవత్సరంలో ఎన్డీఎ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ గా పనిచేశారు.పున్నయ్య కుమార్తె కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ తొలి మహిళా స్పీకర్‌గానూ, రాష్ట్ర కేబినెట్‌ మంత్రిగానూ పనిచేశారు. ఎమ్మెల్సీగా రెండేళ్లపాటు పనిచేశారు.పున్నయ్య మరణంతో కావలితోపాటు శ్రీకాకుళం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: