(ఎన్నికల ప్రత్యేకం) :

రానురాను ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ప్రతీ పార్టీ బాగా ధనవంతులకే ఏరికోరి టిక్కెట్లు ఇస్తుండటమే. అంత డబ్బున్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమవుతుంది ? ఎన్నికలు బాగా ఖరీదైపోతుంది. ఇఫుడు తెలంగాణాలో జరుగుతున్నది కూడా అదే. ఈ ఎన్నికల్లో అత్యంత ధనవంతులు సుమారు 10 మంది పోటీ చేస్తున్నారు.

Image result for komatireddy rajgopal reddy

అత్యంత ధనవంతులంటే వంద కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్న వాళ్ళే సుమా.  వీళ్ళు కాకుండా రూ 50 నుండి రూ 100 కోట్లు ఆస్తులున్నవాళ్ళు మరో 12 మందున్నారు. మరింతమంది ధనవంతులు పోటీ చేస్తుంటే ఈ ఎన్నికలు కూడా అత్యంత ఖరీదు కాక మరేమవుతాయ్.

 

వాళ్ళంతట వాళ్ళుగా ఎన్నికల కమీషన్ కు అందచేసిన అఫిడవిట్ ప్రకారం అందరికన్నా అత్యంత ధనవంతునిగా నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మొదటిస్ధానంలో నిలిచారు. ఈయన ఆస్తుల విలువ రూ 314 కోట్లు.  నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో బిఎస్పీ తరపున పోటీ చేస్తున్న ముత్యాల సునీల్ కుమార్ ఆస్తులు రూ 182 కోట్లు. మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మర్రి జనార్ధనరెడ్డి ఆస్తుల విలువ రూ 161 కోట్లు.

 

నల్గొండ జిల్లాలోని భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కుంబం అనీల్ కుమార్ రెడ్డి ఆస్తుల విలువ రూ 152 కోట్లు. హైదరాబాద్ జిల్లాలోని మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న కుసుమకుమార్ రెడ్డి ఆస్తులు రూ 149 కోట్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న గజ్జల యోగానంద్ ఆస్తులు రూ 146 కోట్లు. సికింద్రబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న కాసాని జ్ఞనేశ్వర్ ముదిరాజ్ ఆస్తులు రూ 131 కోట్లు. ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో బిఎస్పీ అభ్యర్ధిగా  పోటీ చేస్తున్న గడ్డం వినోద్ ఆస్తుల విలువ రూ 131 కోట్లు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్సిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎలుక శ్రీనివాస్ ఆస్తులు రూ 120 కోట్లు. చివరగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి తరపున పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు ఆస్తుల విలువ రూ 112 కోట్లు.

 

తెలంగాణా ఎన్నికల్లో వంద కోట్లకు పైగా ఆస్తులున్న వాళ్ళు పోటీ చేస్తున్నట్లే తక్కువ ఆస్తులున్న వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు లేండి. రూ 10 లక్షలకు పైగా ఆస్తులున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. అంటే రూ 10 లక్షలు కాదు వేలల్లో ఆస్తులున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు పోటీ చేస్తున్నారంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. 10 లక్షల రూపాయలకు పైగా ఆస్తులున్న వాళ్ళని ఓ పదిమందిని తీసుకుందాం. వర్ధన్నపేటలో సిపిఐ ఎంఎల్ తరపున పోటీ చేస్తున్న చిలుముళ్ళ లెనిన్ ఆస్తులు రూ 10 లక్షలు. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఇండిపెండెంట్ గా పనిచేస్తున్న అవుటపల్లి రామలింగేశ్వరరావు ఆస్తులు కూడా రూ 10 లక్షలే.

 

నల్గొండ జిల్లాలోని నాగార్జు సాగర్ నియోజకవర్గంలో సమాజ్ వాది ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న  వడ్లపల్లి రామకృష్ణారెడ్డి ఆస్తులు కూడా పది లక్షలే. హైదరాబాద్ లోని చార్మినార్ నియోజకవర్గంలో బిఎస్పీ తరపున పోటీ చేస్తున్న చిత్రా సక్సేనా ఆస్తులు రూ 10 లక్షలు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న గణపురం అరుణారాణి ఆస్తులు రూ 10.05 లక్షలు. మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలులో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బిజ్జా సంపత్ కుమార్ ఆస్తులు రూ 10.10 లక్షలు.

 

నల్గొండ జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్న దైడా లింగయ్య కు రూ 10.11 లక్షల ఆస్తులున్నాయి.  గ్రేటర్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న గరిసె అశ్విన్ ఆస్తులు రూ 10.12 లక్షలు. ఇది స్ధూలంగా పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో ఎక్కువ, తక్కువ ఆస్తులున్న వారి వివరాలు. అంటే అభ్యర్ధులకున్న ఆస్తులను చూసి జనాలు ఓట్లు వేయరనుకోండి అది వేరే సంగతి. వందల కోట్ల ఆస్తులున్న అభ్యర్ధులు కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వారెందరూ. డబ్బులున్నా లేకపోయినా రాజ్యలక్ష్మి ఎవరిని వరిస్తుందో వారే విజేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: