సస్పెన్స్ కు తెరపడబోతోంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా.. అందరి చూపూ తెలంగాణపైనే ఎక్కువగా ఉంది. కేసీఆర్ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటారా..? ప్రజాకూటమి పాలనా పగ్గాలు చేపడుతుందా.. అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. నేషనల్ సర్వేలకు భిన్నంగా లగడపాటి సర్వే ఉండడం ఈ ఉత్కంఠకు మరింత ఆజ్యం పోసినట్లయింది. 


తెలంగాణ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో వెల్లడి కానున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా లోలోపల మాత్రం అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠతో ప్రధాన రాజకీయపార్టీలు, అభ్యర్థులుతో పాటు కార్యకర్తలు క్షణ మొక యుగంలా గడుపుతున్నారు. గత ఎన్నికల్లో 68.5 శాతం మాత్రమే పోలింగ్ జరగగా.. ఈ సారి రికార్డు స్థాయిలో 73.2 శాతానికి పోలింగ్ పెరిగింది. దీంతో ఈ పెరుగుదల ఎవరిపై ప్రభావం చూపిస్తుందో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.


తెలంగాణలో మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 44 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు జరగనున్న ఒక రౌండ్ లో ఒకేసారి 14  పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కలు తేలనున్నాయి. ప్రతి టేబుల్ వద్ద ఓ పర్యవేక్షకుడు, ఓ సహాయ పర్యవేక్షకుడు, ఓ సూక్ష్మ పరిశీలకుడిని నియమించనున్నారు. అభ్యర్థుల తరపున కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఒక కౌంటింగ్ ఏజెంట్ ను లెక్కింపు కేంద్రంలోపలకు అనుమతించనున్నారు .


ఓట్ల లెక్కింపు ఫలితాలను రౌండ్ల వారీగా ప్రకటించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు సర్వీసు, పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించి తొలి రౌండ్ ఫలితాలను ప్రకటించనున్నారు.. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎం యూనిట్లను కంట్రోల్ యూనిట్లకు అనుసంధానం చేసి రిజల్ట్ మీటను నొక్కగానే సంబంధిత పోలింగ్ కేంద్రంలో మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో స్క్రీన్ మీద కనిపిస్తుంది. లెక్కింపు పర్యవేక్షకులు, సహాయకులు, అభ్యర్థుల ఏజెంట్లు తమకు అప్పగించిన దరఖాస్తుల్లో ఓట్లకు సబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. రిటర్నింగ్ అధికారి ధ్రువీకరించిన తర్వాత సంబంధిత రౌండ్ కు సంబంధించిన ఫలితాలను ప్రకటించనున్నారు. 


ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల కల్లా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు బహిర్గతం కానున్నాయి. శాసనసభ ఎన్నికల బరిలో నిలబడిన 1,821 అభ్యర్థుల్లో 119 మంది విజేతలెవరో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపులో అను నిత్యం సీసీ టీడీ కెమెరాల నిఘాలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, జిల్లా ఎన్నికల అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.


ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశముందన్న కూటమి నేతల అనుమానాల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సుమారు వెయ్యి మంది పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రత్యేక బలగాల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ఎలక్షన్ కమిషన్ అనుమతితో ప్రజా కూటమి బృందాలు నిన్నటి నుంచి కాపలాగా ఉంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: