వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఓటు బ్యాంకుకు జనసేన పెద్ద చిల్లు పెట్టేట్లుగా ఉందని సమాచారం. అదే విషయాన్ని ఇంటెలిజెన్స్ నివేదిక కూడా స్పష్టం చేస్తోందట. తెలుగుదేశంపార్టీకి ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో పెద్ద దెబ్బ పడనుందని చంద్రబాబుకు ఇచ్చిన రిపోర్టులో ఇంటెలిజెన్స్ స్పష్టంగా చెప్పిందట. ఇంటెలిజెన్స్ రిపోర్టు కరక్టే అయితే సుమారు 76 నియోజకవర్గాల్లో టిడిపికి ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ సీట్లున్నాయి. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అసెంబ్లీ సీట్లలో దెబ్బ పడటం ఖాయమైతే ఐదు పార్లమెంటు స్ధానాల్లో కూడా చిల్లు పడటం ఖాయమే.

 

పై జిల్లాలో కాపు సామాజికవర్గం ఓట్లు బాగా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. బిసిలు టిడిపితోను రెడ్లు కాంగ్రెస్ తోను ఉన్నవిషయం తెలిసిందే. అయితే, కాపులు మాత్రం కాంగ్రెస్, టిడిపిల మధ్య అటు ఇటు తిరుగుతుంటారు. కానీ పోయిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కారణంగానే కాపుల్లో మెజారిటీ ఓట్లు టిడిపికి అనుకూలంగా పడింది.  రేపటి ఎన్నికల్లో పవన్ సిన్సియర్ గా ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం కాపుల్లో అత్యధికులు జనసేన వైపే మొగ్గుతారనటంలో సందేహం లేదు.

పోయిన ఎన్నికల్లో టిడిపికి ఓట్లేసిన వారిలో అత్యధికులు రేపటి ఎన్నికల్లో జనసేనకు ఓట్లేస్తే ఆ మేరకు టిడిపికి పెద్ద చిల్లు పడినట్లే. అదే సమయంలో రెడ్లలో అత్యధికులు వైసిపికే ఓట్లేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పై జిల్లాల్లో రెడ్లు వైసిపికి ఓట్లు వేసినా కాపుల ఓట్లకు వచ్చేసరికి జనసేన తర్వాత వైసిపి వైపు చూస్తారు కానీ టిడిపి వైపు చూసేది చాలా తక్కువనే చెప్పాలి. ఇంటెలిజెన్స్ రిపోర్టులో కూడా అదే విషయం స్పష్టంగా ఉందట.  అందుకనే ఇంటెలిజెన్స్ రిపోర్టు చూసిన దగ్గర నుండి చంద్రబాబులో టెన్షన్ మొదలైందట. చూద్దాం ఈ విషయం చంద్రబాబుకు తెలీకుండానే ఉంటుందా ? ఏదో మాయ చేయకుండా ఉంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: