తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని మోడీని కలిశారు. దాదాపు గంటపాటు అనేక అంశాలపై చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలు సీఎం పీఆర్వో మీడియాకు అందిస్తారు. అంతవరకూ ఓకే. కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన కోరికలు, విజ్ఞప్తులు చేశారని దాన్ని బట్టి వార్తలు రాసుకుంటారు. అంతవరకూ సాధారణమే.



కానీ సీఎం కేసీఆర్, మోడీతో భేటీ అయిన సమయంలో దిగిన ఫోటోలు.. ఇంతకుమించి చాలా అర్థాలు చెబుతున్నాయి. ఇటీవల వరకూ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నరేంద్ర మోడీపై బాగానే వాగ్బాణాలు విసిరారు. నిజమాబాద్‌లో కరంటు లేదని అక్కడి ఎన్నికల ప్రచార సభలో మోడీ అబద్దాలు చెప్పారని.. తాను వస్తున్నా అక్కడే ఉండమని సవాల్ విసిరితే పారిపోయారని పలు ఎన్నికల సభల్లో చెప్పారు.



అంతే కాదు.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు రెడీ అవుతున్నా అని చెప్పే సమయంలోనూ మోడీపై గట్టిగానే మాట్లాడారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వరా.. ఇదంతా కేంద్రం అబ్బ సొత్తా అన్నట్టు మాట్లాడారు. కానీ ప్రధాని మోడీని కేసీఆర్ కలిసిన ఫోటోలు చూస్తే.. వీటికి పూర్తి భిన్నంగా ఉంటాయి. సాధారణంగా ప్రధాని అంతటి వారిని ఎవరైనా వినయంగానే నమస్కరిస్తారు.



కానీ కేసీఆర్ నమస్కరించిన ఫోటో చూస్తే.. ఆయన పూర్తిగా వంగి మరీ మోడీకి దండం పెట్టేశారు. కేసీఆర్ ఇచ్చిన కరచాలనాన్ని అందుకున్న మోడీ ఆయన చేయి నిమురుతుండగా.. కేసీఆర్ పూర్తిగా వంగి దండం పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్, మోడీ పరస్పరం గౌరవంగా నమస్కరించుకున్నారు. మరో ఫోటోలో ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఈ ఫోటోలు చూస్తే ఈయనేనా మోడీపై ఆ స్థాయిలో విమర్శలు గుప్పించింది అనిపించకమానదు. ఐతే.. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కేసీఆర్ రూటే సెపరేటు. గౌరవించినా అంతే.. విబేధించినా అంతే.. అందుకే ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరు.


మరింత సమాచారం తెలుసుకోండి: