వైసీపీకి ఈసారి ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయి. పార్టీ పెడుతూనే అధికారంలోకి కొత్త పార్టీ రావాలి. లేకపోతే నిలదొక్కుకోదు, పార్టీ కూడా అంతర్ధానం అవుతుందన్నది రాజకీయ చరిత్ర చెప్పిన సత్యం. అయితే జగన్ తన పార్టీని తొలిసారి గెలుపు తీరాలను చేర్చలేకపోయినప్పటికీ పార్టీని మాత్రం బలంగా తయారుచేసుకున్నారు. పాత చరిత్రను తిరగరాస్తూ పార్టీని సైతం జనంలో ఉంచి రెండవమారు పోరుకు సిధ్ధపడుతున్నారు.


వంద మందితో జాబితా:


వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర జనవరి 9న ఇచ్చాపురంతో ముగియనుంది. ఆ రోజున జరిగే భారీ బహిరంగ సభలో జగన్ వందమంది అసెంబ్లీ అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేయబోతున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికలకు అప్పటికి సరిగ్గా వంద రోజులు సమయం ఉంటుంది కాబట్టి అభ్యర్ధులు జనంలోకి వెళ్ళి తమ బలాన్ని నిరూపించుకునేందుకు   గెలిచేందుకు కూడా వీలైనంత సమయం ఉంటుందని జగన్ భావిస్తున్నారుట. దాంతో తమకు పట్టున్న, జనంలో గెలిచే అభ్యర్ధులుగా ఉన్న వారిని సర్వే చేసి వడపోసిన తరువాతనే జగన్ ఆ రోజు ప్రకటిస్తారని చెబుతున్నారు. 


పది మంది ఎంపీలు :


ఇక ఆ జాబితాతో పాటుగా పది మంది ఎంపీ అభ్యర్ధుల లిస్ట్ ని కూడా జగన్ ప్రకటించడం ద్వారా ఎన్నికల వేడిని ఏపీలో రగులుస్తారుట. పది మంది ఎంపీల్ల్లో ఆ మధ్యన ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామా చేసిన వారికో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు ఉంటారని అంటున్నారు. అదే విధంగా కొన్ని చోట్ల బలమిన మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎంపీ అభ్యర్ధులుగా కనిపించబోతున్నారుట.  ఇలా జగన్ తన సైన్యంతో ఎన్నికల యుధ్ధానికి ఇచ్చాపురం వేదికగా సమర శంఖం పూరిస్తారని అంటున్నారు.


ఫిబ్రవరిలో మళ్ళీ :


ఇవి కాకుండా మిగిలిన 75 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరిలో జగన్ ప్రకటిస్తారని అంటున్నారు. ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్ధుల ప్రకటన చూసుకుని వారికి సమ ఉజ్జీలుగా ఉన్న వారిని కాస్త సమయం తీసుకుని ఎంపిక చేయాలన్నది ప్లాన్ గా కనిపిస్తోంది. అదే విధంగా పదిహేను ఎంపీ సీట్లకు కూడా అభ్యర్ధులను జగన్ నిదానంగానే  ప్రకటిస్తారని అంటున్నారు. మరి జగన్ ఈ ముందస్తు అభ్యర్ధుల ప్రకటన ఏ విధంగా దూకుడు తెస్తుందో చూడాలి. చంద్రబాబు ముందస్తు అభ్యర్ధుల ప్రకటన కంటే కూడా ముందుగానే జగన్ ప్రకటించడం ద్వారా తానే పైచేయి సాధించాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: