ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఓవైపు పవన్ కల్యాణ్ రోడ్ల మీద తిరుగుతూ చంద్రబాబును అమ్మనా బూతులు తిడుతుంటే, ఆయన మాత్రం ‘పవన్ నాతో కలిసి రావాలి’ అంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.   23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను గొర్రెల్లా కొనుగోలు చేసిన సీఎం చంద్రబాబు వారితో జగన్ ను విమర్శిస్తూ లేఖ రాయించారని వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీని ‘కోడి కత్తి పార్టీ’గా అభివర్ణించడంపై కొడాలి నాని ఘాటుగా స్పందించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే మీది కట్టప్ప కత్తి పార్టీనా? వెనకాల నుంచి పొడిచేస్తావా నువ్వు?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.   కేవలం 30 రోజులు అసెంబ్లీకి హాజరై 365 రోజుల జీతాలను టీడీపీ నేతలు తీసుకుంటున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు 30 రోజులు పోగా మిగిలిన జీతాన్ని వెనక్కు ఇచ్చేస్తే.. తాము కూడా అందుకున్న వేతనాలను తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. 

ఎవరో ఒకరి చంక నాకాలి, ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకోవాలి, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో పార్టీ మారినందుకు జోగి రమేశ్, పేర్ని నానితో పాటు తనను అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ డిస్ క్వాలిఫై చేశారని గుర్తుచేసుకున్నారు. 11 నెలల పదవీకాలం మిగిలిఉండగా ఈ చర్య తీసుకున్నారన్నారు.

ఇప్పుడేమో అసమర్థుడైన స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చంద్రబాబు సూచనలతో అసెంబ్లీని నడుపుతున్నారని విమర్శించారు.  అందువల్లే తాము అసెంబ్లీకి పోవడం లేదనీ, ఒళ్లు బలిసి కాదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే ఇప్పుడు జగన్ పై కూడా చంద్రబాబు తన యెల్లో మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. దమ్మున్న నాయకుడు కాబట్టే జగన్ పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతున్నాడని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: