కొడాలి నాని. ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా సుప‌రిచిత‌మే. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగానే కాకుండా టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు నందమూరి తార‌క‌రామారావు అంటే ప్రాణం ఇచ్చే నాయ‌కుడిగా కూడా నాని పేరు తెచ్చుకున్నారు. తొలుత టీడీపీలోనే ఉన్నా.. వివిధ కార‌ణాల‌తో ఆయ‌న పార్టీని విడిచి పెట్టారు. వైసీపీలో చేరిపోయారు. పార్టీల బ‌లంతో సంబంధం లేకుం డా కృష్నా జిల్లా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను పెంచుకున్నారు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నాడ‌నే సంబంధం లేకుండా ప్ర‌జ‌లు ఇక్క‌డ ఆయ‌న‌ను వ‌రుస‌గా గెలిపిస్తూనే ఉన్నారు ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న కొడాలి.. ఎప్ప‌టిక‌ప్పుడు బాబును విమ‌ర్శించ‌డంలో రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నారు. 


అయితే, అలాంటి నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు టీడీపీ ఇప్ప‌టికి రెండు సార్లు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైంది. పార్టీలోని అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు,వ్యాపారాలు ఇలా అనేక కార‌ణాల‌తో టీడీపీ నేత‌లు గుడివాడ‌లో నానికి చెక్ పెట్ట‌లేక పోతున్నారు. ఎంతో సీనియ‌ర్లుగా ఉన్న రావి వెంకటేశ్వరరావు, య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు, పిన్న‌మ‌నేని పూర్ణ‌వీర‌య్య వంటి వారు చేతులు ఎత్తేశారు. ఈ ముగ్గురూ కూడా ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం చ‌లాయించాల‌ని చూసిన నేప‌థ్యంలో కూడా నానికి రాజ‌కీయంగా క‌లిసి వ‌చ్చింది. అయితే, మ‌రో రెండు మాసాల్లో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఇక్క‌డ నానికి చెక్ పెట్టేందుకు ఈ ముగ్గురు క‌లిసి క‌ట్టుగా పోరు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల ఈ ముగ్గురూ ఒకే వేదిక‌పైకి వ‌చ్చారు. టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు కొడాలి నానిపై మండిపడ్డారు. 


అదేవిధంగా మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జీ)లు క‌ల‌సి క‌ట్టుగా నానిపై విరుచుకుప‌డ్డారు. 14 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా చేసిన కొడాలి నాని ఏ ఒక్కరికైనా మేలు చేశారా? అని ప్రశ్నించారు. ఇలాంటి నాయ‌కుడిని ఓడించేందుకు తాము ఒకే వేదిక‌పైకి వ‌స్తామ‌ని, క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వెళ్తామ‌ని సంకేతాలు ఇచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం అయితే, క‌నిపించింది. అయితే, ఈ క‌లిసిక‌ట్టుగా చేస్తున్న రాజ‌కీయాలు టికెట్ ప్ర‌క‌టించేస‌మ‌యానికి విక‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. వీరిలో ఏ ఒక్క‌రికి టికెట్ ప్ర‌క‌టించినా.. అంత‌ర్గ‌తంగా మ‌రో ఇద్ద‌రు ప్ర‌తిప‌క్ష పాత్ర‌పోషిస్తార‌ని, గ‌తంలోనూ ఇలానే చేశార‌ని చెబుతున్నారు. ఇదే ప‌రిణామంపై స్పందించిన నాని.. ఈ ముగ్గురే కాదు.. మ‌రో ముప్పై మంది వ‌చ్చినా.. నా గెలుపు ఖాయం! అని ధీమా వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. సో.. కాబ‌ట్టి.. ఈ ముగ్గురు నేత‌లు ముందు స‌మ‌న్వయం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: