ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అన్ని పార్టీల్లోనూ టికెట్ విష‌యాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. కొంద‌రు నాయ‌కులు టికెట్ల వేట‌లో ముందుండ‌గా.. మ‌రికొంద‌రు టికెట్ ల కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. అయితే, ఈ క్ర‌మంలో టికెట్లు ల‌భించ‌ని నాయ‌కులు మాత్రం తిర‌గుబావుటా ఎగుర‌వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల్లోనూ ఈ త‌ర‌హా టికెట్ల చిచ్చు క‌నిపిస్తోంది. అయితే, కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో అంటే గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని భావిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీల‌కు టికెట్ సెగ‌లు త‌గులుతుండ‌డంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొంటున్నారు. ప్ర‌ధాన విపక్షం వైసీపీ ప‌రిస్థితి ఇలానే ఉంది. ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జ‌ల్లాలోని నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి కొంత ఇబ్బందిక‌రంగా ఉంది. 


2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా ప‌తివాడ నారాయ‌ణ స్వామి నాయుడు విజ‌యం సాధించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఇక్క‌డ పోటీ చేసి ఓడిపోయిన పీవీవీ సూర్య‌నారాయ‌ణ‌రాజును ప‌క్క‌న పెట్టి.. మ‌రోనాయ‌కుడు మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజుకు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా గెలుపు గుర్రాల‌కే టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, ఈ నేప‌థ్యంలో నిర్వ‌హించిన స‌ర్వేలో పెనుమ‌త్స‌ను కూడా ప‌క్క‌కు పెట్టారు. దీంతో ఇక్క‌డ 2009లో కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించిన బొడ్డుకొండ అప్ప‌ల‌నాయుడుకు జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇచ్చారు. 

Image result for botsa satyanarayana

ఈ య‌న వైసీపీలోనే ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు బంధువు కూడా కావ‌డం క‌లిసి వ‌చ్చింది. దీంతో ఇక్క‌డ పార్టీ గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, త‌న‌కు టికెట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించి ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్నారంటూ పెనుమ‌త్స పార్టీకి షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదిలావుంటే, మ‌రోప‌క్క‌, బొత్స కుటుంబానికి చెందిన అప్ప‌ల‌నాయుడుకు టికెట్ ఇవ్వ‌డంపై ఆ కుటుంబంలోని కొంద‌రికి ఇష్టం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.  ముఖ్యంగా బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బొత్స కుటుంబంలో విభేదాలు కూడా వస్తున్నట్లు సమాచారం. పూసపాటిరేగ మండలంలో తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న లక్ష్మణరావుకు.. మంచి ఓటు బ్యాంకు కూడా ఉంది.


అటు సాంబశివరాజు వర్గం, ఇటు బొత్స లక్ష్మణరావు వర్గం బడ్డుకొండ అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉండటంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఉన్నా.. పార్టీలో తలెత్తిన ఈ విబేధాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన శ్రేణుల్లో నెలకొంది. సాంబ‌శివ‌రాజుకు  నెల్లిమర్ల మండలంలో మంచి పట్టుంది. ఆయన అనుచరులైన భోగాపురం నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనిరాజులకు భోగాపురం మండలంలో ఓటు బ్యాంకు ఉంది. ఈ నాయకులంతా కలిసి వైసీపీ అభ్యర్థికి సహకరించకపోతే ఆ పార్టీ గట్టేక్కే పరిస్థితి లేదు. దీంతో ఇక్క‌డ క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు, వ‌ద‌ల‌మంటే పాముకు కోపం అన్న‌ట్టుగా వైసీపీ రాజ‌కీయం న‌డుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: