సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి. ఇది సాదార‌ణంగా వినే మాటే. నిజానికి ఐదేళ్ల కాలంలో అసంతృప్తుల‌కు కొద‌వ ఉండ‌దు. మాకు ఆప‌నిచేయ‌లేదు. మాకు ఈ ప‌నిచేయ‌లేదు. అని చెప్పే నాయ‌కులు పెరుగుతూనే ఉంటారు. అసంతృప్తి కామ‌న్ కూడా. అయితే, విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అత్యంత కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నెల్లిమ‌ర్ల‌కు సంబంధించి అధికార పార్టీ ఎ మ్మెల్యేపై స్థానికంగా ప్ర‌జ‌ల్లోనూ, పార్టీ కేడ‌ర్‌లోనూ కూడా తీవ్ర‌మైన అసంతృప్తి రాజ్య‌మేలుతోంది. రాజ‌కీయ కురువృద్ధు డు ప‌తివాడ నారాయ‌ణ స్వామి ఇక్క‌డ నుంచి 2014లో టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, వ‌యో వృద్ధుడు కావ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పెద్ద‌గా తిర‌గ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. 


దీంతో ప‌తివాడ‌ కుమారులు ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏ ప‌ని చేసినా.. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌సూళ్లు చేస్తున్నార‌ని, దీంతో కాంట్రాక్టర్లు సైతం భ‌య‌ప‌డుతున్నార‌ని అంటున్నారు. ఇక‌, ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యే పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేద‌ని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన మేర‌కు రామ‌తీర్థాన్ని మ‌రో భ‌ద్రాద్రిగా తీర్చిదిద్దుతామ‌న్న హామీ నేటికీ తీర‌లేదు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పోరాటంలో రైతుల పక్షాన ఎమ్మెల్యే నిలబడకపోవడం, నియోజకవర్గంలో మూడు మండలాలకు సాగునీటిని అందజేసేందుకు నిర్మితమవుతున్న తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడం ప్ర‌ధానంగా ఇక్క టీడీపీకి మైన‌స్‌గా మారాయి. 


మ‌రోప‌క్క‌, నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రతికూల అంశాలుగా పరిణమించాయి. ఎమ్మెల్యే సిఫార్సు వలన నియోజకవర్గంలో చిన్న పని కూడా జరగడం లేదన్న అసంతృప్తి కూడా టీడీపీని ఇరుకున పెడుతోంది.  సాధారణ కార్యకర్తలతో పాటు చోటా మోటా నేతలకు కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేర‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో టీడీపీలో ఒక‌విధ‌మైన నైరాశ్యం నెల‌కొంది. దీంతో ఈ ప‌రిణామాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న కొన్ని ప‌థ‌కాలు కూడా ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు చేరువ కాలేదు. పైగా ఇక్క‌డ పేద వ‌ర్గాల‌కు కూడా సంక్షేమ ఫ‌లాలు పూర్తిగా అంద‌డం లేదు. దీంతో ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు నాయ‌కులు. మ‌రి చంద్ర‌బాబు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి. 
  



మరింత సమాచారం తెలుసుకోండి: