రాజకీయాలే పరమావధి. అభివ్రుధ్ది ఎవరికి కావాలి. ఇచ్చిన హామీ నిలబీట్టుకోవాలని ఎందుకు తాపత్రయం పడాలి. ఎన్నికల్లో ఓట్లూ, సీట్లు ఈ గణాంకాల  మీదనే మన ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా సాగిపోతోంది. జనాలకు మేలు చేయడం ఓట్లు తీసుకోవడం అన్నది పాతకధ. ఇపుడు నయా ట్రెండ్ పాలిటిక్స్ నడుస్తోంది. 


విశాఖ జోన్ ఆగిందలా :


విశాఖకు రైల్వే జోన్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఇస్తామని అప్పట్లో ఎన్నికల వేళ బీజేపీ డప్పు వేసింది. దానికి టీడీపీ తెస్తామని తాళం కొట్టింది. అనుకున్నట్లుగానే బాబు, మోడీ జోడీ అక్కడా ఇక్కడా కూడా పవర్లోకి వచ్చింది. కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే టైం వచ్చింది కానీ జోన్ మాత్రం రాలేదు. దీనికి ఫక్త్ రాజకీయమే కారణం అంటున్నారు.
మొదట్లో ఏపీకి జోన్ ఇద్దామని కేంద్రం భావించినా విశాఖ వద్దు విజయవాడ ముద్దు అంటూ టీడీపీ తమ్ముళ్ళు   ప్రాంతీయ  వాదం రాజేశారు. దాంతో అది అలా పెండింగులో పడింది. ఆ తరువాత సీట్ల కోసం బీజేపీ ఎత్తులు వేయడం మొదలుపెట్టింది. పొరుగున ఉన్న ఒడిషాలోని బిజూ జనతాదళ్ తో రాజకీయ  అవసరం కూడా బీజేపీకి ఇపుడూ రేపూ కూడా కావాల్సివస్తోంది. దాంతో విశాఖ రైల్వే జోన్ కల శాశ్వతంగా కలలోకే పోయింది.


పొత్తుల కోసమే :


రేపటి రోజున కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని అంటున్నారు. అదే జరిగితే మోడీకి మద్దతు ఇచ్చే పార్టీలో ఒడిషా బిజూ జనతాదళ్ ముందుంటుంది. మరి ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలంటే వారు వద్దనుకుంటున్న విశాఖ రైల్వే జోన్ ఇవ్వకూడాదు. ఇదీ రాజకీయం. విశాఖకు రైల్వే జోన్ ఇస్తే లాభాల బాటలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఏపీకి సొంతమవుతుంది. దాంతో ఒడిషాలోని ఈస్ట్ కోస్ట్ జోన్ పూర్తిగా దివాళా తీస్తుంది. ఇది పట్నాయక్ సర్కార్ భయం.  దానికి అభయం ఇస్తూ మోడీ సర్కార్ విశాఖ జోన్ని ఏకంగా కోల్డ్ స్టోరెజ్ లో పెట్టేసింది.


ఇక్కడ ఏపీ సర్కార్ తో పాటు రాజకీయ పార్టీలు కూడా పెద్దగా వత్తిడి చేసింది లేదు. మొక్కుబడిగానే విశాఖకు జోన్ కావాలని టీడీపీ సహా అన్ని పార్టీలు చెప్పడం తప్ప గట్టిగా డిమాండ్ చేసిన దాఖాలాలు లేవు. అన్నీ తీసుకుపోయి విజయవాడలో పెట్టాలనుకుంటున్న టీడీపీ సర్కార్ తాపత్రయం కూడా విశాఖ జోన్ రాకపోవడానికి మరో కారణం అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొత్తానికి అందరూ తలా కాస్తా సాయం చేసి విశాఖకు జోన్ లేకుండా, రాకుండా చేసేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హీరో ఎవరూ అంటే పొరుగున ఉన్న నవీన్ పట్నాయక్  అని చెప్పుకోవాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: