వేలంపాటలో యాత్ర మూవీ టిక్కెట్టు రికార్డు ధరకు అమ్ముడుపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితచరిత్ర ఆథారంగా యాత్ర బయోపిక్ తీసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ బయోపిక్ ఈ నెల 7వ తేదీన విడుదలవుతోంది. చిత్ర నిర్మాణ యూనిట్ ప్రీమియర్ షో మొదటి టిక్కెట్టును అమెరికాలో వేలం వేసింది. ఆశ్చర్యకరంగా మొదటి టిక్కెట్టును మునీశ్వరరెడ్డి అనే అభిమాని 6,116 డాలర్లకు గెలుచుకున్నారు. అంటే మన కరెన్సీలో రూ 4.37 లక్షలన్నమాట.

 

మునీశ్వరరెడ్డి గెలుచుకున్న టిక్కెట్టును 12 డాలర్లకే అతినికిచ్చి మిగిలిన డబ్బును వైఎస్సార్ ఫౌండేషన్ కు అందించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏదేమైనా వేలంపాటలో మొదటి టిక్కెట్టును రూ 4.37 లక్షలకు కొనుగోలు చేయటమంటే మామూలు విషయం కాదు. యాత్ర మూవీపై జనాల్లో మంచి క్రేజు వచ్చిందన్నది మాత్రం వాస్తవం. వైఎస్ పై జనాల్లో ఉన్న అభిమానం, వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించటం లాంటి అనేక అంశాలు సినిమాపై హైప్ ను పెంచేస్తున్నాయి. దానికి తోడు యూనిట్ విడుదల చేసిన టీజర్లు కూడా సినిమా అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తున్నాయి.  మరి సినిమా విడుదల తర్వాత ఏమవుతుందో చూడాల్సిందే.

 

ఇప్పటి వరకూ విడుదలైన బయోపిక్ ల్లో ఎన్టీయార్ జీవితకథ ఆధారంగా తీసిన మహానాయకుడు సినిమా ఫ్లాప్ అయ్యింది. సినిమాలో సన్నివేశాలు కావచ్చు, బాలకృష్ణ గెటప్పులు కావచ్చు జనాలను పెద్దగా మెప్పించలేదనే చెప్పాలి. అంతకుముందే రిలీజైన మహానాటి సావిత్రి బయోపిక్ సృష్టించిన సంచలనం అంతాయింతా కాదు. దాంతో ఎన్టీయార్ బయోపిక్ పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. అయితే విడుదలైన సినిమా జనాలను మాత్రం మెప్పించలేకపోయింది. తాజాగా ఫిబ్రవరి 7వ తేదీన విడుదలవుతున్న  వైఎస్సార్ బయోపిక్ ఏమవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: