భారత దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న మతాలకు చెందిన వారు ఉన్న విషయం తెలిసిందే.  భారత దేశంలో పుట్టినప్పటి నుంచి కులం, మతం అన్న విషయాన్ని తమ సర్టిఫికెట్స్ లో పొందుపరుస్తున్నారు.  అయితే కులాలకు అతీతంగా మానవ సమాజం నిర్మించాలని ఎంతో మంది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నా..అది మాత్రం ఆచరణ సాధ్యం కాలేదు.  కానీ మొదటి సారిగా ఓ యువతి ఏ కులం, మతానికి చెందిన వ్యక్తిని కాదని సర్టిఫికెట్ పొందింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పతూర్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..తిరుప్పతూర్ మండలంలోని ఎం.ఎ.స్నేహను తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కులమతాలకు అతీతంగా పెంచారు. దీంతో ఆమె పాఠశాల నుంచి డిగ్రీ సర్టిఫికెట్ల వరకూ అన్నింటిలో  కులం, మతం కాలమ్స్ ను ఖాళీగా వదిలేశారు. ఈ నేపథ్యంలో తనకు కులం, మతం లేని సర్టిఫికెట్ కావాలని అధికారుల కోరింది.  కానీ వారు మాత్రం రక రకాల సాకులు చెబుతూ నిరాకరిస్తూ వచ్చారు.  మొత్తానికి ఈ విషయం తిరుప్పతూర్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక పంకజమ్ దృష్టిలో పడింది.

వెంటనే ఆ యువతి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించారు.ఇందులో యువతి చెప్పిన వివరాలన్నీ నిజమని తేలడంతో ఆమెకు కులం, మతం లేదని సర్టిఫికెట్ జారీచేయాలని ఆదేశించారు. దాంతో ఈ నెల 5న స్నేహకు అధికారులు ‘ఎలాంటి కులం మతం లేదని సర్టిఫికెట్ జారీచేశారు. దీనిపై స్నేహ హర్షం వ్యక్తం చేశారు.  ఇదే విషయంపై స్నేహ భర్త పార్తబ స్పందిస్తూ..తమకు ముగ్గురు కుమార్తులు ఉన్నారని..వారి స్కూల్ దరఖాస్తుల్లో కూడా కులం, మతం ప్రస్తావన తీసుకురాలేదని స్పష్టం చేశారు. కాగా, ఈ తరహా సర్టిఫికెట్ ను దేశంలో అందుకున్న తొలి వ్యక్తి స్నేహానేనని అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: