అవును తెలుగుదేశంపార్టీలో మొదలైన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అందరూ వైసిపి నిర్వహిస్తున్న బిసి గర్జన పైనే దృష్టి పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు వైసిపి నిర్వహిస్తున్న భారీ బహిరంగసభ ఇదే అని చెప్పవచ్చు.  చంద్రబాబునాయుడు మీద అసంతృప్తి కావచ్చు లేదా రాబోయే ఎన్నికల్లో టిడిపి మళ్ళీ అధికారంలోకి రాకపోవచ్చన్న అనుమానంతో ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీని వదిలేస్తున్నారు. ఇప్పటికి ముగ్గురు ఎంఎల్ఏలు, ఓ ఎంపితో పాటు కీలక నేత దాసరి జై రమేష్ టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

టిడిపిని వీడిన ఎంఎల్ఏ, ఎంపిల్లో ఓ ఎస్సీ, రెడ్డి, ఇద్దరు కాపులున్నారు. మరింత మంది ఎంఎల్ఏలు, ఎంపిలు టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించనున్న బిసి గర్జన నిర్వహణను వైసిపి ప్రతిష్టగా తీసుకుంది. టిడిపిలో సుమారు 15 మంది బిసి ఎంఎల్ఏలున్నారు. వీరిలో కూడా చాలామంది చంద్రబాబు వైఖరిపై మండిపోతున్నారు.

 

ఇంతకాలం చంద్రబాబుపై ఏమీ మాట్లాడని వాళ్ళు కూడా తాజాగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి వివిధ వర్గాలకు అనేక హామీలిచ్చారు. అందులో  భాగంగానే బిసిలకు కూడా చాలా హామీలిచ్చారు. బిసి అనేది ఓ విస్తృత పదం. ఎందుకంటే, అందులో సుమారు 140 ఉపకులాలున్నాయి.

 

అన్నీ ఉపకులాలను ఆకట్టుకునేందుకు తానిచ్చిన హామీలను మరోసారి గుర్తు చేయటంతో పాటు చంద్రబాబు బిసిలకు చేసిన మోసాన్ని ఎండగట్టటం కూడా బహిరంగసభ ప్రధాన ఎజెండా. బహుశా రాబోయే ఎన్నికల్లో ఎంఎల్ఏ, ఎంపి టికెట్ల విషయాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉందని సమాచారం. మరి జగన్ ఏ విషయంపై దృష్టి పెడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: