మాగుంట శ్రీనివాస‌రెడ్డి పార్టీ మార్పుపై వ‌స్తున్న వార్త‌ల‌పై ఎక్క‌డా స‌మాధానం దొర‌క‌డం లేదు. రెండు మూడు రోజులుగా ఆయ‌న పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున మీడియాలో క‌థ‌నాలు కూడా వ‌స్తున్నాయి. అయినా వాటిని మాగుంట ఖండించ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు మీడియా ప్ర‌తినిధులు , రాజ‌కీయ స‌న్నిహితులు ఇదే నిజమేనా అంటూ ఆరా తీసిన‌ప్పుడు కూడా ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడుతూనే అస‌లు విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. మాగుంట‌ వైసీపీలో చేరుతున్న‌ట్లు  ఆపార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాత్రం చెప్పుకొస్తున్నారు. మాగుంట విష‌యం ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్ ద‌`ష్టికి వెళ్లింద‌ని..త్వ‌ర‌లోనే ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేసేది ఆయ‌న‌కు వివ‌రిస్తామ‌ని పేర్కొన‌డం కొస‌మెరుపు. టీడీపీలో క్రియాశీల‌కంగా ప‌నిచేస్తున్న క్ర‌మంలోనే ఆయ‌న ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌ముందే ఇలా వైసీపీ నేత‌లు మా పార్టీ నేత అన్న‌ట్లుగా మాట్లాడ‌టం స‌రికాద‌ని టీడీపీ వ‌ర్గాలు ఆక్షేపిస్తున్నాయి.


ఇక ఆయ‌నకు టీడీపీలో అన్యాయం జ‌రిగిన మాట మాత్రం వాస్త‌వ‌మేన‌ని ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం పేర్కొంటోంది. కొంత‌మంది రాష్ట్ర పార్టీ కార్యాల‌య నాయ‌కులు, ఎమ్మెల్సీలు జ‌నార్ధ‌న్‌, చౌద‌రిలతో పాటు మ‌రికొంత‌మంది  సీబీఎన్ ఆర్మీ పేరుతో మాగుంట‌ను బెదిరింపుల‌కు గురి చేశార‌ని చెబుతున్నారు. అయితే ఇంత జ‌రుగుతున్నా మాగుంట ఎందుకు చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేయ‌లేదు అన్న‌దానికి మాత్రం వారి వ‌ద్ద స‌రైన స‌మాధానం ల‌భించ‌డం లేదు. అయితే చంద్ర‌బాబు వ‌ద్ద మాత్రం ఒంగోలు పార్ల‌మెంట్ సెగ్మంట్ ప‌రిధిలోని అభ్య‌ర్థుల‌ను తాను సూచించిన వారికే టికెట్లివ్వాల‌ని ఆయ‌న చంద్ర‌బాబుతో అన్నార‌ట‌. అందుకు సానుకూలంగా స్పందించార‌ట‌. అయినా మాగుంట‌కు న‌మ్మ‌కం కుద‌ర‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అంటూ మ‌రికొంత‌మంది నేత‌లు చెబుతున్నారు.


ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలో ప‌నిచేస్తున్న‌ప్పుడు కొంత ప‌ట్టువిడుపులు ఉండాలి...అంతా మ‌నం అనుకున్న‌ట్లు జ‌ర‌గాల‌ని ఏం ఉండ‌కూడ‌దు. మాగుంట చెప్పిన‌ట్లుగా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తే అసంత‌`ప్తి చెల‌రేగి అస‌మ్మ‌తుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంటుంద‌ని, అప్పుడు ఎంత‌మందిని బుజ్జ‌గించగ‌ల‌మ‌ని టీడీపీ వ‌ర్గాలు ఎదురు ప్ర‌శ్న‌లు వేస్తున్నాయి. ఇప్ప‌టికే అసంత‌`ప్తుల సంఖ్య‌..అస‌మ్మ‌తుల పోరు ఎక్కువ‌గా ఉంద‌ని దాన్ని అర్థం చేసుకోకుండా ఇలా ఆయ‌న పార్టీకి దూరంగా ఉండ‌టం స‌రైంది కాద‌ని హితవు ప‌లుకుతున్నారు. అయితే మాగుంట మాత్రం ఇప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డంతో గంద‌ర‌గోళ వాతావ‌రణ‌మైతే క‌నిపిస్తోంది. ఆయ‌న పార్టీలో ఉంటారా..?  లేక వైసీపీలో చేరుతారా అన్న‌ది మాత్రం ఒక‌టి రెండు రోజుల్లో తేలిపోతుంద‌ని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: