తెలుగుదేశంపార్టీ ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని వైసిపి మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి హేళన చేస్తు మాట్లాడటం సంచలనంగా మారింది. మాగుంటను వైసిపిలోకి చేర్చుకుంటారన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసిపి తరపున  ఒంగోలు ఎంపిగా మాగుంటే పోటీ చేస్తారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. మాగుంట ఉండటానికి టిడిపిలోనే ఉన్నా ఆయన మనసంతా వైసిపిపైనే ఉందట.

 

నిజానికి చంద్రబాబునాయుడు బలవంతం మీదనే ఇంతవరకూ మాగుంట టిడిపిలో కంటిన్యు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. మాగుంటను వైసిపిలోకి తీసుకురావటానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు, మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఓడిపోయిన వాళ్ళను పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతోంది. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా తానే పోటీ చేస్తానని కూడా ప్రకటించారు.

 

మాగుంటకు వైసిపిలోకి రావాలని ఉన్నా వైవి చేసిన వ్యాఖ్యలతో వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని వద్దనే నిర్ణయం పూర్తిగా జగన్ దే. అయినా మధ్యలో వైవి లాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యలు పార్టీకి చేటు తెస్తాయే కానీ ఏమాత్రం మంచి జరగవు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా కొత్త వాళ్ళు పోటీ చేస్తారన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు వైవి కౌంటర్ ఇచ్చినట్లున్నారు.

 

 బాలినేని, వైవి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమనేట్లున్నాయి పరిస్దితులు. దాంతో ఇద్దరు కలిసి పార్టీ పరువును నడిరోడ్డున పడేస్తున్నారు.  రాబోయే ఎన్నికల్లో జగన్ గనుక  వీళ్ళద్దరినీ పోటీకి దూరంగా ఉంచితేనే జిల్లాలో పార్టీకి మంచి జరుగుతుంది. ఒంగోలు ఎంపిగా తానే పోటీ చేస్తానని వైవి చెప్పటంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అంతటితో ఆగకుండా మాగుంట గురించి అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు. మొత్తానికి జిల్లా పార్టీలో కీలకమైన ఇద్దరు నేతలను జగన్ గనుక కంట్రోల్లో పెట్టుకోలేకపోతే రేపటి ఎన్నికల్లో నష్టం తప్పదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: