టాలీవుడ్ విలక్షణ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు రాజకీయాల్లోకూడా చురుకుగా పాల్గొంటుంటారు.  నటుడు, దర్శకుడు,విద్యావేత్త, రాజకీయ రంగాల్లో ఆయన సత్తా చాటుకుంటూ వస్తున్నారు.  తాజాగా మోహన్ బాబు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు పై తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదల విషయంలో చొరవ చూపడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫైర్‌ అయ్యారు.

ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు తనకెంతో సన్నిహితుడని, ఒకప్పుడు తమ విద్యానికేతన్‌, కళాశాల గొప్పదని ఆయనే అంటే పొంగిపోయానని అన్నారు.   2014-15 విద్యా సంవత్సరం నుంచి తమ సంస్థ విద్యార్థుల ఫీజులు ఇవ్వలేదని, అప్పుడప్పుడూ తమ కళాశాలకు భిక్షం మాత్రం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఇస్తామని ఆ సందర్భంలో హామీ ఇచ్చినా చంద్రబాబు మాటనిలబెట్టు కోలేకపోయారని విమర్శించారు.

‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్టు’ అమలు కాని హామీలు, మాటలు ఎందుకన్నారు. ఏపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యార్థుల అభివృద్దికి కృషి చేస్తున్నామని బాబు పలుమార్లు అన్నారని..విద్యాభివృద్దికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాని అన్నపుడు తానెంతో సంతోష పడ్డానని..కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని సాక్షాత్తు చంద్రబాబుకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. తాను ఏ పార్టీకీ చెందిన వ్యక్తిని కాదని, తక్షణం తమ ఆవేదనను అర్థం చేసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: