తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక‌య్యే ప‌రిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఒక‌రి వెంట ఒక‌రు అన్న‌ట్లుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ అత్య‌ధికంగా ఎమ్మెల్యేలు గెలిచిన ఖ‌మ్మం జిల్లా నుంచి ఎక్కువ జంపింగ్‌లు అవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్‌ను వీడగా.. తాజాగా గురువారం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుపై విజయం సాధించిన కందాల గురువారం ప్రగతిభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భేటీ అయ్యారు.


దీనికి కొన‌సాగింపుగా మ‌రో షాక్ త‌గిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌, కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్‌రావు ఆ పార్టీకి గుడ్‌భై చెప్పే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావును ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు క‌లిసిన‌ట్లు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఈ భేటీ సంద‌ర్భంగా టీఆర్ఎస్‌లో చేరేందుకు వ‌న‌మా సంసిద్ధత వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీనికి టీఆర్ఎస్ త‌ర‌ఫు నుంచి గ్రీన్ సిగ్న‌ల్  వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. 


ఇదిలాఉండ‌గా, ఇప్పటివరకు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి,ఉపేందర్‌రెడ్డి ఇప్పటికే కేసీఆర్‌కు మద్దతు ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్ రావు చేరారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వీరిదారిలో ఉన్నట్టుగా సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: