పశ్చిమ గోదావరి జిల్లాకు పడమర వైపున సరిహద్దుగా…పచ్చని పైరు పొలాలతో కళకళాడుతూ ఉండే...ఉండి నియోజకవర్గంలో ఈ సారి అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపాల మధ్య రసవత్తరమైన పోటీ జరగనుంది. తెదేపా అభ్యర్థిగా క‌ల‌వ‌పూడి సొసైటీ అధ్య‌క్షులు మంతెన రామరాజు (కలవపూడి రాంబాబు), వైకాపా అభ్యర్థిగా పీవీఎల్‌ నరసింహరాజు ఎన్నికల బరిలో కొత్తవారే కావడం విశేషం. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుండి గెలిచిన శివరామరాజుని తెదేపా అధిష్టానం నర్సాపురం పార్లమెంట్ బరిలో నిలిపింది. ఇక రెండు పార్టీలు నుండి పోటీ చేసే అభ్యర్ధులు ఒకే సామాజికవర్గానికి చెందిన వారే కావడం విశేషం.


ముందుగా తొలి జాబితాలో చంద్ర‌బాబు శివ రామ‌రాజును ఉండి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి... చివ‌ర‌కు వైకాపా అభ్య‌ర్థిగా ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజును ఢీకొట్టాలంటే శివే క‌రెక్ట్ అని ఆయ‌న్ను ఎంపీ రేసులో దించారు. అభ్యర్ధిగా ఎంపిక అయిన దగ్గర నుండి రామరాజు ప్రచారం చేస్తూనే...ఆత్మీయ సమ్మేళనాల ద్వారా తెదేపా శ్రేణులతో మమేకమవుతున్నారు. అలాగే తటస్థులు, ఇతర పార్టీలోని ఓ మాదిరి క్యాడర్‌ని తెదేపాలోకి ఆహ్వానించేందుకు రహస్య మంతనాలు సాగిస్తున్నట్లు  సమాచారం. అదేవిధంగా గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తన విజయానికి దోహదం చేస్తాయని ధీమాగా ఉన్నారు.
నియోజకవర్గంపై పట్టు ఉన్న శివరామరాజు...రామరాజుకి పూర్తి మద్ధతు ఇవ్వడం ప్లస్ కానుంది. అటు ఉండి నియోజకవర్గం తెదేపాకి కంచుకోటగా ఉంది.

ఇక్కడ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, జన్మభూమి కమిటీలలో అవినీతి జరిగిందని విమర్శలు ఉండటం టీడీపీకి మైనస్.
అటు వైకాపా అభ్యర్థి నరసింహరాజు నియోజకవర్గంలోని విస్తృతంగా ప్రచారం చేస్తూ...పలువురిని పార్టీలో చేర్చుకుంటూ దూసుకెళుతున్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో ఈ ప్రాంతంలో పార్టీ మరింతగా బలపడింది. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత వైసీపీకి ప్లస్ కానుంది. కానీ టీడీపీకి ఉన్నంత కార్యకర్తల బలం వైసీపీకి లేకపోవడం మైనస్. ఇక్కడ పవన్ కల్యాణ్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అది జనసేనకి ప్లస్ అవుతుంది.

కానీ టీడీపీ, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. అయితే జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఏ  పార్టీకి విజయావకాశాలు గండి కొడుతుందో చూడాలి. ఈ నియోజకవర్గంలో ఉండి, కాళ్ళ, ఆకివీడు, పాలకోడేరు మండలాలు ఉన్నాయి. వీటిలో ఉండి, పాలకోడేరులో టీడీపీ బలంగా ఉండగా, కాళ్ళలో ఆ పార్టీకే ఎడ్జ్ ఉంది. ఆకివీడులో జనసేన ప్రభావం కొంత ఉంది. ఇక ఇక్కడ కాపు, క్షత్రియ, బీసీ సామాజికవర్గాలు గెలుపుని శాసించనున్నాయి. మరి ఈ సారి ఉండిలో రాజు ఎవరు అవుతారో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: