గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ప‌రిస్థితి ఎలా ఉంది?  ఇక్కడ ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు. గ‌డిచిన ఐదు ఎన్నిక‌ల నుంచి కూడా వ‌రుస విజ‌యాలు న‌మోదు చేస్తున్న టీడీపీ నాయ‌కుడు ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ త‌న సంప్ర‌దాయాన్ని నిల‌బెట్టుకుంటారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అదేస‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున కూడా బ‌ల‌మైన నాయ‌కుడిగా బ‌రిలోకి దిగిన‌.. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు కిలారు రోశ‌య్య ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కుతాడా? అనే లెక్క‌లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఆస‌క్తికర చర్చ సాగుతోంది. 


1982లో టీడీపీ ఆవిర్భావం, 1983 నుంచి ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేస్తుండ‌డం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూ డా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో ధూళిపాళ్ల కుటుంబమే గెలుస్తోంది. టీడీపీ జెండానే ఎగురుతోంది. దాదాపు 35 సంవత్స రాలుగా ఇక్క‌డ ప్ర‌జ‌లు టీడీపీకే ప‌ట్టం క‌డుతున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ హ‌వా చెక్కుచెద‌ర‌ద‌నే రేంజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. 1983 నుంచి 1994 వ‌ర‌కు ధూళిపాళ్ల వీర‌య్య‌చౌద‌రి విజ‌యం సాధించారు. ఇక‌, 1994 నుంచి జ‌రిగిన ఐదు ఎన్నిక‌ల్లోనూ దూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ పోటీ చేయ‌డం, గెలుపు గుర్రం ఎక్క‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఆయ‌న‌పై వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న నాయ‌కులు మారుతున్నారే త‌ప్ప‌.. న‌రేంద్ర గెలుపు మాత్రం ఆగ‌డం లేదు. 


ఇక‌, తాజా ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ టికెట్ వ‌రుస‌గా ఆరోసారి కూడా న‌రేంద్ర‌కుమార్‌కే ద‌క్కింది. ఇక‌,  ఈ ఎన్నిక‌ల్లో న‌రేంద్ర‌ను ఓడించాల‌ని బావిస్తున్న‌ వైసీపీ.. బ‌ల‌మైన నాయ‌కుడు, గుంటూరు మిర్చి సంఘం ప్రెసిడెంట్‌గా ఉన్న కిలారు రోశ‌య్య‌ను రంగంలోకి దింపింది. నిన్న‌టి వ‌ర‌కు గుంటూరు ఎంపీ రేసులో ఉన్న రోశ‌య్య ఇప్పుడు ఆక‌స్మాత్తుగా పొన్నూరు నుంచి అసెంబ్లీ రేసులో ఉన్నారు.ఆర్థికంగా, సామాజికంగా కూడా బ‌లంగా ఉన్న రోశ‌య్య త‌న‌దైన శైలిలో దూసుకు పోతున్నారు. ప్ర‌తి ఒక్క‌ర‌నీ క‌లుపుకొని పోవ‌డంతో పాటు.. ప‌దునైన విమ‌ర్శ‌ల‌ను కూడా చేస్తున్నారు. దీంతో ఇక్క‌డ గ‌తానికి భిన్నంగా ఎన్నికల పోరు ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


ఇక‌, బ‌లా బ‌లాల విష‌యానికి వ‌స్తే.. 
న‌రేంద్ర కుమార్‌కు సంప్ర‌దాయ ఓటింగ్‌, టీడీపీ బ‌ల‌మైన కేడ‌ర్‌, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అనుకూలంగా ఉన్నాయి.కిలారు రోశ‌య్య విష‌యానికి వ‌స్తే.. ఒక్క‌సారైనా మార్పు కోరుతున్న వారు ఉన్నారు. ఇది క‌ల‌సి వ‌స్తోంది. అదేవిధంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం, న‌వ‌ర‌త్నాలు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త క‌లిసి వ‌స్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో రోశ‌య్య సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువుగా ఉండ‌డం ఆయ‌న‌కు క‌లిసొస్తున్నా... నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను త‌ప్పించ‌డంతో ఆయ‌న వ‌ర్గం పార్టీకి స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: