చిన్న చిన్న సంఘటనల వల్ల రాజకీయాల్లో తమ పేరును కోల్పోవడం సహజమే. ఐతే రాజకీయాల్లో ఉంటూ తప్పులు చేసి... తమ భవిష్యత్తుకు ఏసరు పెట్టుకున్న వాళ్లు చాలామంది ఉండగా. అరంగేట్రంలోనే తప్పటడుగులు వేసిన పొలిటీషియన్‌గా ఆలీ పేరు చెప్పుకోవచ్చు. మామూలుగా ఆలీకి ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తే.. అతను ఏదో ఒక పార్టీని ఎంచుకుని ఆ పార్టీ కోసం కొంచెం కష్టపడితే ఈజీగా ఎమ్మెల్యే అయ్యేవాడు. తనకున్న ప్రజాకర్షణ దృష్ట్యా అదృష్టం, సమీకరణాలు కలిసొస్తే మైనారిటీ శాఖ మంత్రి కావడానికి కూడా అవకాశం ఉండేది.

కానీ ఆలీ మాత్రం అసలు పార్టీ కోసం కష్ట పడకుండానే మంత్రి కావలని అనుకున్నాడు. తాను ఏ పార్టీలో చేరితే మంత్రి కావచ్చో తేల్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఒక్కొక్కరుగా పార్టీల అధినేతల్ని కలిశాడు.ఒక దశలో తెలుగుదేశం పార్టీలో ఆయన చేరడం ఖాయంగా కనిపించింది. కానీ ఆయనకు ఆ పార్టీ అధికారంలోకి రావడంపై సందేహాలు ఉండడంతో. అలాగే ఆ పార్టీ టికెట్ విషయంలో హామీ ఇచ్చినా మంత్రి పదవి విషయంలో గ్యారెంటీ లేకపోవడంతో ఆయన తెలుగుదేశం విషయంలో వెనక్కి తగ్గారు. తర్వాత ఆలీ  వైఎస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్లారు. కానీ అక్కడ టికెట్ ఖరారు కాలేదు. కానీ ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చే విషయంపై హామీ దక్కినట్లు తెలుస్తోంది. 

ఈ విషయాన్నే పార్టీలో చేరిన సందర్భంగా చెప్పకనే చెప్పాడు ఆలీ. ఐతే ఆ రోజుకు పోటీ చేయట్లేదని చెప్పినప్పటికీ. ఆలీ టికెట్ మీద ఆశలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. తీరా తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆలీలో అసహనం బయటపడిపోయింది.  ఎన్నికల్లో పోటీ చేయకుండా మంచి అవకాశాన్ని కోల్పోయానేమో అని అంతర్మథనం మొదలైంది. దీంతో జనసేన టికెట్ కోసం ప్రయత్నించినట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆలీకి టికెట్ ఇవ్వడం పెద్ద సమస్య కాదు కానీ. ఈ స్థితిలో అతడిని పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుందని పవన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆలీ పరిస్థితి ఎటూ కాకుండా తయారైంది.

అసలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకుండానే ఈ స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని, క్రెడిబిలిటీ కోల్పోయిన వ్యక్తి మరొకరు కనిపించరు. అతను ముందే జనసేనలోకి చేరి తన మిత్రుడు పవన్‌కు అండగా నిలుస్తూ. ఆ పార్టీ కోసం పని చేస్తే అతడి రేంజే వేరుగా ఉండేది. ఆ పార్టీలో కీలక నేత అయ్యేవాడు. ఎమ్మెల్యే అయి చక్రం తిప్పేవాడు. కానీ అసలు కష్టమే పడను. కానీ ఒకేసారి మంత్రి పదవి వచ్చేయాలనుకున్నాడు. తన గురించి మరీ ఎక్కువగా ఊహించుకుని. ఎటూ కాకుండా పోయాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: