అపార రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నాయ‌కుడికి...యువ ఆలోచ‌న‌ల‌తో నియోజ‌క‌వ‌ర్గాన్నిఅభివృద్ధి బాట ప‌ట్టిన నేత‌కు మ‌ధ్య ఈసారి ప‌ర్చూరులో ఎన్నిక‌ల యుద్ధం సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏలూరి సాంబ‌శివ‌రావు మ‌ళ్లీ అదే పార్టీ నుంచి పోటీ చేస్తుండ‌గా టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు తోడ‌ల్లుడు ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్లు వైసీపీ నుంచి ఇక్క‌డ బ‌రిలోకి దిగుతుండ‌టం విశేషం. ఇక నియోజ‌క‌వ‌ర్గం చ‌రిత్ర విష‌యానికి వ‌స్తే  గ‌తంలో ఇక్క‌డి నుంచి రాజ‌కీయ ప్రాతినిధ్యం, రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ఆరంభించిన వారు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులుగా ప‌నిచేయ‌డం గ‌మ‌నార్హం. అయితే నేత‌లైతే ఎదిగారి గాని అభివృద్ధి మాత్రం ఆమ‌డ‌దూరంలోనే ఉండిపోయింది. నియోజకవర్గం 1955లో ఏర్పడగా ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. 


ఈ నియోజకవర్గంలో పర్చూరు, కారంచేడు, చినగంజాం, ఇంకొల్లు, యద్దనపూడి, మార్టూరు మండలాలున్నాయి. ఇప్పటివరకు  జరిగిన అన్ని ఎన్నికల్లో తలపడిన కాంగ్రెస్‌ పార్టీ 7 సార్లు విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక ఎనిమిది సార్లు ఆపార్టీ అభ్యర్థులు బరిలో నిలవగా 4 సార్లే విజయం సాధించారు. ఎక్కువసార్లు కాంగ్రెస్, టీడీపీలు తలపడ్డాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యంపై అటు వైసీపీ ఇటు టీడీపీ శ్రేణులు ఎవ‌రికి వారే ధీమాతో ఉండ‌టం విశేషం.   గ‌తంలో ఇక్క‌డి నుంచి వెంక‌టేశ్వ‌ర్లు ప్రాతినిధ్యం వ‌హించి ఉండ‌టం ఆయ‌న‌కు కొంత క‌ల‌సి వ‌చ్చే అంశంగా చెప్ప‌వ‌చ్చు. వాస్త‌వానికి ఈ సారి ఎన్నిక‌ల్లో కొడుకు హితేష్‌ను రంగంలోకి దింపాల‌ని ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర్లు-పురందేశ్వ‌రి దంప‌తులు యోచించారు. అయితే హితేష్ అమెరికా పౌర‌స‌త్వం ర‌ద్దు కాక‌పోవ‌డంతో చివ‌రికి మ‌ళ్లీ వెంక‌టేశ్వ‌ర్లునే బ‌రిలోకి దిగాల్సి వ‌చ్చింది. 


కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో వెంక‌టేశ్వ‌ర్లు  గ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న స‌తీమ‌ణి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవ‌ల వెంక‌టేశ్వ‌ర్లు వైసీపీలో చేర‌గా ఆమె బీజేపీలో కొన‌సాగుతున్నారు. భార్య‌భ‌ర్త‌లు వేర్వేరు పార్టీల్లో కొన‌సాగుతుండ‌టం విప‌క్షాల‌కు విమ‌ర్శ‌నాస్త్రాలు ప్ర‌యోగించేందుకు అవ‌కాశంగా మారింది. అవ‌కాశవాద రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా భార్య‌భ‌ర్త‌లు మారార‌ని ఇప్ప‌టికే టీడీపీ తూర్పార‌బ‌డుతోంది. పాత త‌రం నాయ‌కుడిగా అనుభ‌వం వెంక‌టేశ్వ‌ర్లు సొంత‌మ‌నే చెప్పాలి. అయితే ఎన్నిక‌ల‌కు చాలా త‌క్కువ స‌మ‌యం ఉండ‌టం, వైసీపీలోని వ‌ర్గాలు ఆయ‌న‌కు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తాయి..గ‌తంలో ఉన్న ఆయ‌న వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు ఏ మేర‌కు స‌డ‌ల‌కుండా ఉంద‌నే ప‌లు అంశాలు ఇప్పుడు ఆయ‌న విజ‌య‌వ‌కాశాల‌ను నిర్ణ‌యిస్తాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


అదే స‌మ‌యంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావు కూడా చాలా బ‌లంగా ఉండ‌టం ఆయ‌న‌కు ఎదురుదెబ్బే అని చెప్పాలి. వాస్త‌వానికి ప‌ర్చూరు ప్ర‌జ‌లంతా ఏలూరి వెంటే అనే నినాదం ఎన్నిక‌ల‌కు ముందు నుంచి బ‌లంగా విన‌బ‌డుతోంది. దీనికి తోడు టికెట్ విష‌యంలో ఆయ‌న‌కు క్లారిటీ ఉండ‌టంతో చాలా రోజుల నుంచి అన‌ధికార ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న నిమ‌గ్న‌మ‌య్యారు. దీనికి తోడు పార్టీలో ఆయ‌న‌కు అస‌మ్మ‌తి లేక‌పోవ‌డం అద‌న‌పు బోన‌స్ అనే చెప్పాలి.  ఇక వైసీపీ నుంచి కొంత‌కాలం క్రితం వ‌ర‌కు రామ‌నాథం బాబు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సారి ఎన్నిక‌ల‌కు ఆయ‌న ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించారు.  అయితే ఆయ‌న్ను కాద‌ని అక‌స్మాత్తుగా వ‌చ్చి చేరిన వెంక‌టేశ్వ‌ర్లుకు ఇవ్వ‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్తాపం చెందారు. ఇటీవ‌ల ఆయ‌న టీడీపీ గూటికి చేరుకున్నారు. ఆయ‌న చేరిక‌తో టీడీపీకి మ‌రింత బ‌లం చేకూరింద‌నే చెప్పాలి. ఈ ప‌రిణామాల‌న్నీ ఏలూరికి మేలు చేసేవే అంటూ టీడీపీలో ఆనందం వ్య‌క్త‌మ‌వుతుండ‌గా వైసీపీలో మాత్రం కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి త‌యార‌వ‌డం గ‌మ‌నార్హం.  


మరింత సమాచారం తెలుసుకోండి: