పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సారి తెదేపా, వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. గత ఎన్నికల్లో తెదేపా తరుపున లక్ష మెజారిటీతో గెలిచిన మాగంటి వెంకటేశ్వరరావు(బాబు)... మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనుండగా....వైకాపా నుండి మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు వారసుడు శ్రీధర్ బరిలో ఉన్నారు. జనసేన నుంచి ఆర్థిక వేత్త పెంటపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనసేన కూడా మిగతా రెండు పార్టీలకు గట్టి పోటిస్తుంది. దీంతో త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉందన్న అంచ‌నాలు ఉన్నా జ‌న‌సేన నామ‌మాత్ర‌మ‌య్యేలా ఉంది. తెదేపా నుంచి బరిలోకి దిగుతున్న మాగంటి బాబుకి అటు వెస్ట్ గోదావరి...ఇటు కృష్ణా జిల్లాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో తెదేపా బలంగా ఉంది. 


అలాగే ప్రత్యేకహోదా కోసం పార్లమెంట్‌లో గట్టిగానే పోరాడారనే పేరు బాబుకి ఉంది. అటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పెట్టని కోటలా ఉన్న సామాజిక వర్గం, స్థానికంగా అందుబాటులో ఉండటం మాగంటి బాబుకి కలిసొచ్చే అంశాలు. అయితే గత ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తుతో తెదేపా పోటీ చేసింది కానీ ఈసారి ఆ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. దీంతో ఓట్లు చీలి తెదేపాకి మైనస్ కావొచ్చు. వైకాపా అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ శ్రీధర్ తండ్రి కోటగిరి విద్యాధరరావుకి మంచి పేరుంది. జిల్లాపై మంచి పట్టుంది. అలాగే వైకాపా కూడా బలం పుంజుకుంది. ఇవే శ్రీధర్‌కి ప్లస్ కానున్నాయి. అదే సమయంలో రాజకీయాలకి కొత్త కావడం...తెదేపా, జనసేనలు కూడా బలంగా ఉండటం మైనస్ కానున్నాయి. అటు జనసేన నుంచి సీనియర్ నేత, ఆర్ధిక వేత్త పెంటపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. 


పోలవరం ప్రాంతానికి ఈయనకు నియోజకవర్గంలో సత్సంబంధాలతోపాటు రైతు ఉద్యమ నేతగా పేరు ఉంది. పోలవరం నిర్వాసితుల తరఫున పోరాడారు. మేధావిగా పేరున్న ఈయన ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనున్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్న కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం జనసేనకి కలిసిరావొచ్చు. కానీ తెదేపా, వైకాపాలకి ఉన్న బలమైన క్యాడర్ జనసేనకి లేకపోవడం మైనస్. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలు...కృష్ణా జిల్లాలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో తెదేపా ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో విజయం సాధించగా...తెదేపాతో పొత్తులో భాగంగా భాజపా కైకలూరులో గెలిచింది. 


ఇక నూజివీడులో వైకాపా గెలిచింది. అయితే ఈ సారి దెందులూరు, ఉంగుటూరులలో తెదేపా, కైకలూరులో వైకాపా బలంగా ఉన్నాయి. చింతలపూడి, పోలవరం, నూజివీడులలో తెదేపా, వైకాపాల మధ్య హోరాహోరీ పోరు ఉండగా...ఏలూరులో త్రిముఖ పోరు ఉంది. మొత్తం మీద ఇక్కడ తెదేపాకి కొంత ఆధిక్యత కనిపిస్తుంది..కానీ జనసేన చీల్చే ఓట్ల ప్రభావం ఎవరికి నష్టం కలిగిస్తుందో చూడాలి. ఈ పార్లమెంట్ పరిధిలో బీసీలు, ఎస్సీలు, కాపు ఓటర్లు ఎక్కువ. వారే గెలుపోటములని ప్రభావితం చేయనున్నారు. మరి చూడాలి ఈ హోరాహోరీ పోరులో ఏలూరుని ఎవరు దక్కించుకుంటారో.
ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: