తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్‌లో ఈ సారి ఆసక్తికరమైన పోరు జరగనుంది. గత ఎన్నికల్లో సుమారు 1.60 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మాగంటి మురళీమోహన్ ఈ సారి పోటీ చేయలేనని చెప్పడంతో...అసలు కథ మొదలైంది. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారో అనే విషయం అందరికీ అర్ధాంకాకపోయినా...మురళీమోహన్ మాత్రం తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చంద్రబాబుకు వివరించారు. దీంతో చంద్రబాబు ఎంపీగా ఎవరిని దింపాలన్న తీవ్ర కసరత్తు చేసి...చివరికి తెదేపాలో యాక్టివ్‌గా ఉంటున్న మురళీమోహన్ కోడలు మాగంటి రూపని రాజమహేంద్రవరంలో బరిలో దింపారు. ఇక అటు జగన్ కూడా ఎం. భరత్‌ని పోటీలోకి దింపగా...జనసేన నుండి సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.


తెదేపా నుండి పోటీ చేస్తున్న మాగంటి రూప పారిశ్రామికవేత్తగా మంచి  పేరు తెచ్చుకున్నారు. ఆమె గెలుపు కోసం మురళీమోహన్ కూడా ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా మురళీమోహన్‌కి మంచి సంబంధాలు ఉన్నాయి. గత ఐదేళ్లు ఎంపీగా ఉండి కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులని తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేశారు. అటు రూపకి కూడా స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులతో మంచి పరిచయాలు ఉండటం.. ఆమెకు ప్లస్ పాయింట్‌గా మారింది. అయితే ప్రత్యేకహోదా విషయంలో మురళీమోహన్‌కి సంబంధించిన కొన్ని నెగటివ్ కామెంట్స్ రావడం మైనస్. ప్రస్తుతం తెదేపా ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చింది. పైగా జనసేన పోటీ చేస్తుంది. ఇది తెదేపా గెలుపుపై ఏ మేర ప్రభావం చూపనుందో ఎన్నికల్లో చూడాలి.


అటు వైకాపా నుంచి బీసీలకి చెందిన ప్రముఖ సినీ నిర్మాత‌, యంగ్ హీరో మార్గాని భరత్‌ పోటీ చేస్తున్నారు. మిగతా నేతలు ఓసీలు కావడం...ఈయన బీసీ కావడం ప్లస్. జగన్ పాదయాత్ర తర్వాత రాష్ట్రంలో వైకాపా బలపడటం కలిసిరానుంది. అయితే జనసేన ఓట్ల చీలిక వైకాపాకి నష్టం తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన నుండి సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ బరిలోకి దిగనున్నారు. ఆకులకి పార్లమెంట్ పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే పవన్ కల్యాణ్ ఇమేజ్, కాపు ఓటర్లు ఎక్కువ ఉండటం ప్లస్ కానున్నాయి. కానీ తెదేపా, వైకాపాల అంత బలం జనసేనకి లేకపోవడం మైనస్. ఇక ఈ పార్లమెంట్ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్, అర్బన్, అనపర్తి, రాజానగరం ఉండగా..పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, గోపాలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. 

గత ఎన్నికల్లో తెదేపా పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ నుంచి బీజేపీ గెలవగా...ఇక మిగతా అన్నీ స్థానాల్లో తెదేపానే గెలిచింది. కానీ ఈసారి అన్నీ నియోజకవర్గాల్లో తెదేపా, వైకాపాల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.  పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఎస్సీలు, కాపులు, శెట్టిబలిజలు, యాదవులు అధికంగా ఉండగా కొన్నిచోట్ల రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కొప్పులవెలమ, పద్మశాలి కాస్త ఎక్కువగా ఉంటారు. వడ్డెర, రజక, మత్స్యకార, నాయీబ్రాహ్మణ, తూర్పుకాపు వంటి వర్గాలు కూడా ఉన్నాయి. అయితే గత ఎన్నికల మాదిరిగా ఏకపక్ష విజయం రావడం కష్టం. మూడు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. మరి ఈ పోరులో  గెలిచేదెవరో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: