తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదు. గత ఎన్నికల్లో రుజువైన వాస్తవమిది. గత ఎన్నికలే కాదు. అంతకు ముందు జరిగిన అనేక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ దూసుకుపోయింది. తెలంగాణలో ఆ పార్టీకి పరాజయం అన్నదే లేకుండాపోయింది. 

ఇక టీఆర్ఎస్ పగ్గాలు యువరాజు కేటీఆర్ చేతికి వచ్చాక ఈ జోరు మరింత పెరిగింది. ప్రతిపక్షం అన్నది లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ నుంచి గెలిచినవారిని కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చేసుకుంటున్నారు. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. 


కేటీఆర్‌కు తొలి పరాజయం ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో పలకరించింది. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ బలపరిచిన  తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై  తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయభేరి మోగించారు. 

ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  మొత్తం 18,885 ఓట్లు పోలయ్యాయి. నర్సిరెడ్డికి 8976 ఓట్లు, పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో పూల రవీందర్‌ టీఆర్‌ఎస్ అభ్యర్థి వరదారెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. ఈ ఎమ్మెల్సీ పరాజయంతో కేటీఆర్ టీమ్‌కు షాక్ తగిలినట్టైంది. మరి ఖమ్మం ఎంపీ ఎన్నిక ఏం చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: