దక్షిణాదిలో తమిళనాడు రాజకీయాలది ప్రత్యేక పాత్ర. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళతో పోల్చితే తమిళనాడు ఓటరు తీర్పు ప్రతిసారి భిన్నంగానే ఉంటుంది. జాతీయ పార్టీలకు ఇక్కడ అస్సలు ప్రాతినిధ్యం ఉండదు. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందా... లేకుంటే ఢిల్లీ పెత్తనానికి అవకాశం లభిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

తమిలనాడులో రెండు రాజకీయ పార్టీలదే ఇన్నాళ్లూ హవా. అయితే డీఎంకే లేకుంటే అన్నా డీఎంకే.. వీళ్లద్దరిదే అధికారం. కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ చోటు లేదు. అయితే జయలలిత మరణం తర్వాత సీన్ మారిపోయింది. జాతీయ పార్టీల జోక్యం ఎక్కువైంది. అన్నాడీఎంకే పెద్దలు పదవిని కాపాడుకోవడం కోసం బీజేపీని ఆశ్రయించారు. అదే సమయంలో డీఎంకే కాంగ్రెస్ కు చేరువైంది. ఇదే సమయంలో రజనీ, కమల్ కూడా బరిలోకి దిగితే సీన్ మరింత రసవత్తరంగా ఉంటుందని భావించారు. అయితే వాళ్లిద్దరూ ముందే చేతులెత్తేశారు.

తమిళనాడులో జయలలిత లేకుండా అన్నాడీఎంకే తొలిసారి ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రాజకీయ కురువృద్ధుడు.. కరుణానిధి అండలేకుండా డీఎంకే మొదటిసారిగా బరిలోకి దిగుతోంది. ఇద్దరు దిగ్గజనేతలు లేకపోవడంతో తమిళరాజకీయాలు కాస్త కళ తప్పాయి. అయితే ఆ లోటును సినీస్టార్లు రజనీకాంత్ కమల్ కహాసన్ భర్తీ చేస్తారని అంతా భావించారు. కానీ రజనీ ముందు నిరాశపరిచారు. పోటీ చేసేది లేదని ప్రకటించి.. అభిమానులు ఉత్సాహంపై నీళ్లు చల్లేశారు. కమల్ హాసన్ అయితే చివరి దాకా ఊరించారు. అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నాం.. పోటీ ఖాయం అటూ హడావుడి చేశారు. అయితే చివర్లో తేడా కోట్టేసింది. పార్టీలో కీలక నేతల మధ్య విభేదాలు.. రాజీనామాలతో కమల్ కి ఎదరుదెబ్బ తగిలింది.. ఇప్పుడు ఆయన కూడా ఈసారికి పోటీ చేయడంలేదని ప్రకటించారు.

Image result for tamil nadu politics

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవి కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం కీచులాడుకుంటే.. తెర వెనుక నుంచి.. శశికళ తీవ్ర ప్రయత్నాలే చేశారు. ఇక అన్నా డీఎంకే పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అనుకున్న సమయంలో ప్రధాన మోడీ తన దూతల్నిరంగంలోకి దించారు. శశికళ, దినకరన్ బ్యాచ్ ను కంట్రోల్ చేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను దారికి తెచ్చారు. అవకాశాన్ని అందిపుచ్చుకుని... మొత్తానికి మోడీ అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మోడీ అండతో అన్నాడీఎంకే అక్కడ బరిలోకి దిగుతోంది.

ఇక కరుణానిధి లేకుండా డీఎంకే ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ రాహుల్ కి జైకొట్టారు. కాంగ్రెస్ తో దోస్తీ కట్టి బరిలోకి దిగుతున్నారు. రాహుల్ గాంధీయే మా ప్రధాని అభ్యర్థి అని ప్రకటించేశారు కూడా. కరుణానిధి లేకపోయినప్పటికీ ఆ లోటును స్టాలిన్ చాలా వరకు భర్తీ చేశారనే చెప్పొచ్చు. డీఎంకేకు స్టాలినే ఇప్పుడు పెద్ద దిక్కు. నిజానికి డీఎంకేకి కాంగ్రెస్ అండతో పనిలేదు. కాంగ్రెస్ కే డీఎంకే తో దోస్తీ అవసరం. అయినా స్టాలిన్.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేందుకు రాహుల్ కి పెద్ద పీట వేస్తున్నారు.

Image result for tamil nadu politics

అన్నాడీఎంకే నుంచి బహిష్కృతుడైన దినకరన్ కూడా తమిళనాడులో తన బలం ఏమిటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. జయలలిత నియోజవర్గం నుంచి గెలుపొందిన దినకరన్ అమ్మకు అసలైన వారసుడిని తానేనని చాటాలని చూస్తున్నారు. ఆయన కూడా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అయితే ఆయనకు పార్టీ గుర్తు ఇంకా ఖరారు కాకపోవడం మైనస్.

ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల పాత్ర ఇక్కడ నామమాత్రమే. అవి రెండూ డీఎంకే, అన్నాడీఎంకేలపైనే ఆధారపడ్డాయి. ఆ పార్టీలు కూడా ఈ రెండు పార్టీలపైనే ఆధారపడ్డాయి. అందుకే తగిన స్థాయిలో సీట్లు కేటాయించాయి. మరి దిగ్గజాలు లేని ఈ ఎన్నికలు తమిళనాడులో ఎలాంటి సంచలనాలకు కారణమవుతాయో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: