మ‌ల్కాజ్‌గిరి ఎన్నిక‌ల బ‌రిలో బిజీ బిజీగా ఉన్న  కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఓ వైపు సొంత ఇలాకా కొడంగ‌ల్‌లో ఓట‌మిని అధిగ‌మిస్తూ మ‌ల్కాజ్‌గిరీలో స‌త్తా చాటుకోవాల‌ని చూస్తున్న రేవంత్‌కు అన‌నుచ‌రుల నుంచే స‌హ‌కారం అంద‌డం లేదు. ఆయ‌న అనుచ‌రుడు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 


టీడీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేసిన అరికెల న‌ర్సారెడ్డి  పార్టీ సీనియ‌ర్ నేత‌గా గుర్తింపు పొందారు. స్థానికసంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎంపిక‌య్యారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. అనంత‌రం రేవంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న‌కు షాకిస్తూ టీఆర్ఎస్ కండువా క‌ప్పుకొంటున్నారు. త్వరలోనే తన అనుచరులతో కాంగ్రెస్ శ్రేణులను టీఆర్‌ఎస్‌లో చేర్పించేందుకు నిజామాబాద్‌లో భారీ సభ నిర్వహించనున్నట్టు అరికెల నర్సారెడ్డి తెలిపారు.


నర్సారెడ్డికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నర్సారెడ్డి చేరిక పట్ల హర్షం వ్యక్తంచేసిన కేటీఆర్, పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. ఎంపీగా కవితను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అందరితో కలిసి సమిష్ఠిగా పనిచేయాలని అరికెలకు కేటీఆర్ సూచించారు. ఇటు టీఆర్ఎస్ పార్టీకి ఈ చేరిక బ‌లం కాగా...కాంగ్రెస్‌కు ప్ర‌ధానంగా రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: