అనకాపల్లి రాజకీయ క్షేత్రంగా ఇద్దరూ బస్తీమే సవాల్ అంటున్నారు. కొణతాల అన్నిపార్టీలు తిరిగి చివరికి టీడీపీలో చేరిపోయారు. దాడి వీరభద్రరావు మాత్రం నిలకడగా ఉంటూ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. జగన్ సైతం ఆయన్ని ఆదరించి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అంతేకాదు, అనకాపల్లిలో పార్టీని గెలిపించాలని కూడా కోరారు. దానికి తగినట్లుగా రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారంలో ఉంది.


విశాఖజిల్లాలో రాజకీయంగా బద్ద శత్రువులైన మాజీమంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామక్రిష్ణ ఇపుడు మళ్ళీ ఎదురుగా నిలిచి యుధ్ధానికి సై అంటున్నారు. అయితే వారు అభ్యర్ధులు కాదు, అంతకంటే ఎక్కువగానే సమరానికి సిధ్ధపడిపోవడమే విశేషం. ఈ ఇద్దరు నేతలది మూడు దశాబ్దాల వైరం. టీడీపీ నుంచి దాడి, కాంగ్రెస్ నుంచి కొణతాల ఎన్నిసార్లు పోరాడుకున్నారో లెక్కేలేదు. అనకాపల్లి అసెంబ్లీ సీటు నుంచి ఇద్దరూ పోటీపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇపుడు మాత్రం ఇద్దరూ రథ సారధులుగా కథ నడిపిస్తున్నారు. అందులో ఎదుటి వారి ఓటమి చూడాలని కసి మీద పనిచేస్తున్నారు.


ఇక దాడి తన సర్వశక్తులు ఒడ్డి మరీ అనకాపల్లి వైసీపీ అభ్యర్ధి గుడివాడి అమర్నాధ్ ని గెలిపించడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, కొణతాలకు స్వయంగా వియ్యకుడు అయిన పీలా గోవింద సత్యనారాయణని ఓడించాలని దాడి శపధం పట్టారు. దీని ద్వారా తనసత్తాను చాటుకోవడమే కాకుండా చిరకాల ప్రత్యర్ధి కొణతాలకు కూడా చెక్ పెట్టినట్లు అవుతుందని దాడి భావిస్తున్నారు.
ఇక కొణతాల కూడా అదే పట్టుదల మీద ఉన్నారు. తాను టీడీపీలో ఏ షరతులు లేకుండా చేరిపోయారు.

అనకాపల్లిలో పార్టీని గెలిపించడం ద్వారా చంద్రబాబు మన్ననలు అందుకోవాలని, రేపటి రోజున పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు వెళ్లాలని కొణతాల ఆలోచిస్తున్నారట. దాంతో ఈ ఇద్దరు మాజీలకు ఈ గెలుపు చాలా ముఖ్యమైనది అయిపోయింది.దాంతో ఈ ఎన్నికల్లో వయసును కూడా లెక్క చేయకుండా ఎండల్లో తిరుగుతూ చాలా కష్టపడిపోతున్నారు. ఇది పోటీలో ఉన్న అభ్యర్ధులకు చాలా సుఖంగా ఉంటోంది మరి. మరి ఈ ఇద్దరిలో ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలనటున్నారు అనకాపల్లి వాసులు.



మరింత సమాచారం తెలుసుకోండి: