రాష్ట్రంలో రాజకీయ వైరం పరంగా ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి...పార్టీల విషయాన్ని పక్కనబెడితే...ఇక్కడ కేవలం వ్యక్తుల మధ్యనే పోటీ జరుగుతుంది. ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్ధులుగా ఉంటున్న దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత వెంకట కృష్ణప్రసాద్‌లు...ఈసారి మైలవరం బరిలో ఢీ అంటే ఢీ అంటున్నారు. నందిగామలో 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వెంకట కృష్ణప్రసాద్‌ని..ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావుని ఉమా టీడీపీ నుంచి పోటీ చేసి ఓడించారు. ఆ తర్వాత నందిగామ ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో 2009, 14 ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా గెలుపొందారు. ఈ సారి కూడా ఆయనే మరోసారి టీడీపీ తరుపున బరిలోకి దిగుతున్నారు.  అయితే 2014కి ముందు కాంగ్రెస్‌ని వీడి టీడీపీలో చేరిన వసంత కుటుంబం...కొంతకాలం కిందట వైసీపీలో చేరింది. ఇక చేరడమే జగన్ వెంకటకృష్ణప్రసాద్‌కి మైలవరం టికెట్ ఇచ్చారు. దీంతో మళ్ళీ పాత ప్రత్యర్ధులు ఒకచోట చేరినట్లైంది.


ఉమా చేతిలో త‌న‌కు చాలాసార్లు అవ‌మానాలు జ‌రిగాయ‌న్న క‌సితో ర‌గులుతోన్న వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ మైల‌వ‌రంలో త‌న గెలుపును అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక 2014లో గెలిచి మంత్రి అయిన దేవినేని ఉమా....తన శాఖ జలవనరులపై మంచి పట్టు తెచ్చుకున్నారు. పోలవరం, పట్టిసీమ నిర్మాణాల్లో, రాయలసీమకి నీరు తీసుకునివెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. నియోజకవర్గంలో పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయించారు. 23 ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు అందించడం, భారీఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేయడం, పార్టీలకతీతంగా చంద్రన్న బీమా, సీఎం సహాయ నిధి చెక్కులు అందించటం, ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉండటం ఉమాకి కలిసొచ్చే అంశాలు. అయితే మంత్రిగా ఉండటం వలన నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని విమర్శ ఉండటం, పథకాలను క్షేత్రస్థాయిలో గట్టిగా ప్రచారం చేయలేకపోవడం, టీడీపీ నేతల్లో సమన్వయం లేకపోవడం మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. అంతే కాక గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు త‌క్కువ మెజార్టీ వ‌చ్చిన గ్రామాల్లో నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డంతో పాటు క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో ఉమాను వ్య‌తిరేకిస్తోన్న వారంతా వైసీపీలోకి జంప్ చేయ‌డం ఆయ‌నకు పెద్ద ఎదురు దెబ్బే.


మరోవైపు ఆరు నెలల ముందు నుంచే వసంత నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ..పార్టీని బలోపేతం చేశారు. ఆర్ధిక, అంగబలంగా ఉన్న వసంత కుటుంబానికి నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మైండ్ గేమ్ ద్వారా టీడీపీ నేతలనీ పార్టీలోకి రప్పించారు. నియోజకవర్గంలో చీరలు, గోడ గడియారాలు పంచి ప్రజలని ఆకర్షించే పనులు చేశారు. అయితే టీడీపీకి ఉన్న బలమైన కేడర్ వైసీపీకి లేకపోవడం...పార్టీలో అసంతృప్తి నేతలు మైనస్ అవ్వొచ్చు. అయితే సామాజిక ప‌రంగాను, ఆర్థికంగాను ఉమాకు స‌రైన ప్ర‌త్య‌ర్థి కావ‌డంతో మంత్రికి ముచ్చెమ‌ట‌లే ప‌డుతున్నాయి.


ఇక జనసేన తరుపున  అక్కల రామ్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. కొంతవరకు ఓట్లు చీలుస్తారుగానీ...గెలిచే అంత సత్తా జనసేనకి లేదు. ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జి. కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం మండలాలతో పాటు విజయవాడ గ్రామీణ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బీసీలదే అగ్రస్థానం. 1.20 లక్ష ఓట్లు బీసీలవే. వీరి తర్వాత కమ్మ 40వేలు, ఎస్సీ 40 వేలు ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత కాపు 25 వేలు, రెడ్డి 16 వేలు ఉన్నాయి. అయితే బీసీ, కమ్మ, ఎస్సీలే ఎవరి గెలుపునైనా ప్రభావితం చేయగలరు.  రాష్ట్రంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో భారీగా నోట్ల క‌ట్ట‌లు తెగే నియోజ‌క‌వ‌ర్గాల్లో మైల‌వ‌రం ప్ర‌ధ‌మ స్థానంలో ఉంది. ప్రస్తుత పరిణామాలని బట్టి చూస్తుంటే దేవినేని-ఉమా మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఎవరు గెలిచిన బొటాబొటి మెజారిటీతోనే బయటపడతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: