జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటంతో  భీమవరం నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది. దీంతో రాష్ట్రంలో హాట్ ఫైట్ జరిగే స్థానాల జాబితాలో భీమవరం కూడా వచ్చి చేరింది. అయితే ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ-వైసీపీ అభ్యర్ధులని నిలువరించి పవన్ ఏ మేర విజయం సాధిస్తారు అనేది చూడాలి. గత రెండు పర్యాయాలుగా గెలిచి మరోసారి టీడీపీ తరుపున పోటీ చేస్తున్నారు పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు). ఇక గత ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి బలం పుంజుకుని వైసీపీ తరుపున గ్రంథి శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. ఇలా మూడు పార్టీలు...ముగ్గురు అభ్యర్ధులతో భీమవరంలో త్రిముఖ పోరు జరగడం ఖాయమైంది. పవన్‌కి మెయిన్ ప్లస్ పాయింట్ పవన్ ఇమేజ్‌నే...ఆయన్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే భీమవరంలో తన సామాజికవర్గం అయినా కాపు ఓట్లు ఎక్కువ ఉండటం. అయితే పవన్ గెలిచి అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా...సమస్యలపై పోరాడతారనే భావనతో తటస్థ ఓటర్లు పవన్ వైపు వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్‌కి ధీటుగా టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు ఉన్నారు. వీరిని తట్టుకుని పవన్ విజయం సాధించడం అనేది కష్టమనే చెప్పాలి.


ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి అంజిబాబు ఈ ఐదేళ్లు నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధే చేశారు. అలాగే టీడీపీ కేడర్ కూడా బలంగా ఉంది. ఇక సౌమ్యుడుగా ఉండటం వలన అంజిబాబుపై ప్రజలు పాజిటివ్‌గానే ఉన్నారు. అటు సంక్షేమ పథకాలు అమలు అంజిబాబుకి మేలు చేసేలా ఉన్నాయి. పైగా ఎన్నికల ముందే పెన్షన్లు, డ్వాక్రా మహిళలకి డబ్బులు రావడం, రుణమాఫి డబ్బులు పడటం కూడా కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్‌ నుంచి వచ్చిన రామాంజనేయులు అసలైన టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు, నామినేటేడ్‌ పదవులు ఇవ్వటంలో అన్యాయం చేశారని ఒకవర్గం ఆగ్రహంతో ఉంది. వీరు అంజిబాబుకి ఎన్నికల్లో సహకరించడం కష్టమే అని తెలుస్తోంది. ప‌దేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నా రెండుసార్లు అధికార‌ప‌క్షంలోనే ఉన్నా భీమ‌వ‌రం రేంజ్‌ను పెంచే అంచ‌నాలు అందుకోవ‌డంలో మాత్రం ఆయ‌న విఫ‌ల‌మ‌య్యాడు. 


మరోవైపు వైసీపీ అభ్యర్ధి గ్రంథి శ్రీనివాస్ అపోజిషన్‌లో ఉండి...ప్రజా సమస్యలపై పోరాడారు అనే పేరుంది. శ్రీనివాస్‌కి మాస్ నాయకుడిగా గుర్తింపు ఉంది. గతంకంటే ఈ సారి వైసీపీ బలపడింది. కేడర్ కూడా కసితో పని చేస్తున్నారు. అలాగే శ్రీను వ్యూహాత్మకంగా అడుగులేస్తూ....బలంగా ఉన్న టీడీపీ నేతలనీ తన వైపుకి తిప్పుకుంటున్నారు. అసలు పవన్ పోటీలో లేకపోతే శ్రీనునే గెలిచేవాడని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. పవన్ పోటీలో ఉండటమే ఇప్పుడు వైసీపీకి మైనస్. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న‌కు వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉంది. సామాజికవర్గాల ఓట్ల పరంగా చూస్తే... కాపు ఓటర్లే ఇక్కడ ఎక్కువ. వీరు దాదాపు 70 వేల వరకు ఉన్నారు. ఇక అన్నీ కులాలు కలిపి బీసీలు లక్ష వరకు ఉన్నారు. అలాగే ఎస్సీలు క్షత్రియులు కూడా బాగానే ఉన్నారు.  క్షత్రియులు ఆర్ధికంగా బలంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులు కాపు సామాజికవర్గానికే చెందిన వ్యక్తులే. పవన్ మీద అభిమానంతో కాపులు ఎక్కువ జనసేన వైపు ఉండే అవకాశం ఉంది. కానీ టీడీపీ అభ్యర్ధి అంజిబాబుకి కొన్ని గ్రామాల్లోని కాపులు పూర్తి మద్ధతు ఇస్తున్నారు. అటు వైసీపీ అభ్యర్ధికి కూడా కొంతమంది మద్ధతు ఇస్తున్నారు.  బీసీలు మూడు పార్టీలకి మద్ధతు ఇచ్చే అవకాశం ఉంది. ఎస్సీలు ఎక్కువ వైసీపీ వైపు ఉండొచ్చు.  


ఇక రాజకీయంగా, ఆర్ధికంగా క్షత్రియులు ప్రభావం ఎక్కువ...వీరు కొంతవరకు టీడీపీకి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్తితులని బట్టి చూస్తుంటే ఎవరి గెలుపు అంత సులువు కాదు. ముగ్గురు మధ్య హోరాహోరీ అయితే జరగడం ఖాయం. ఎవరు గెలిచిన అతి తక్కువ మెజారిటీతోనే బయటపడతారు. అయితే ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని బ‌ట్టి చూస్తే టీడీపీ మూడో ప్లేస్‌లో ఉండ‌గా ప్ర‌ధాన పోటీ ప‌వ‌న్‌, గ్రంధి శ్రీను మ‌ధ్యే ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: