రాష్ట్రంలో పార్టీల పరంగానే కాకుండా వ్యక్తుల మధ్య రాజకీయ వైరం పరంగా హోరాహోరీగా ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాల్లో మైలవరం ఒకటి. దశాబ్దాలుగా రాజకీయ వైరం కొనసాగిస్తున్న దేవినేని-వసంత కుటుంబాలు మైలవరంలో ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ తరుపున మూడోసారి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం బరిలో దిగుతుండగా...దేవినేనికి ఎలా అయిన చెక్ పెట్టాలనే ఉద్దేశంతో...వైసీపీ వసంత వెంకట కృష్ణప్రసాద్‌ని రంగంలో దింపింది. ఇక వీరికి మేము పోటిస్తామని చెప్పి జనసేన అక్కల రామ్మోహన్ రావుని పోటీ చేయిస్తుంది. అయితే జనసేన అభ్యర్ధి ఉన్నా..అసలు పోరు మాత్రం టీడీపీ-వైసీపీల మధ్యే జరగనుంది. ఇంకా చెప్పాలంటే గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా దేవినేని వ‌ర్సెస్ వ‌సంత ఫ్యామిలీల మ‌ధ్య ఉన్న రాజకీయ వైరం నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల అటు ఉమాకు, ఇటు కేపీ (వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌)కు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.


కృష్ణా జిల్లాలోనే కాదు ఇంకా చెప్పాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఏకంగా రూ.200 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు (కేవ‌లం ఓట‌ర్ల‌కు పంచే డ‌బ్బు మాత్ర‌మే) టోట‌ల్ ఖ‌ర్చు ఇంకా ఎక్కువే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా. ఓట‌ర్ల‌కు డ‌బ్బుల పండ‌గే కానుంది. ఇక 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఉమా...నియోజకవర్గంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు. కానీ 2014లో ఎమ్మెల్యేగా గెలవడం టీడీపీ అధికారంలోకి రావడంతో....ఉమాకి మంత్రి పదవి కూడా దక్కింది. అలాగే తనకి కేటాయించిన జలవనరుల శాఖపై కూడా మంచి పట్టు తెచ్చుకున్నారు. పోలవరం, పట్టిసీమ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు. అలాగే నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు అందించారు. అదేవిధంగా పార్టీలకతీతంగా చంద్రన్న బీమా, సీఎం సహాయ నిధి చెక్కులు ప్రజలకి ఇచ్చారు. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్ ఉండటం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు చేయడం ఉమాకి కలిసొచ్చే అంశాలు. అయితే ఉమా నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదని విమర్శ ఉంది. దీనికి తోడు టీడీపీ నేతల్లో కూడా సరైన సమన్వయం లేకపోవడం ఎన్నికల్లో ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు మెజార్టీ రాని గ్రామాల్లో నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్ట‌డం కూడా ఉమాకు మైన‌స్‌.


అటు ఏడెనిమిది నెలల ముందే మైలవరంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ..ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఇక అభ్యర్దిగా తన పేరు ఖరారైన దగ్గ నుంచి చీరలు, గోడ గడియారాలు పంచి ప్రజలని ఆకర్షించే పనులు చేశారు. అలాగే ఆర్ధిక, అంగబలం బాగా ఉన్న వసంత..బలమైన టీడీపీ నేతలనీ పార్టీలోకి రప్పించారు. కానీ ఇక్కడ టీడీపీకి ఉన్న బలమైన కేడర్ వైసీపీకి లేకపోవడం  వైసీపీకి మైనస్ అయ్యేలా కనిపిస్తోంది. పెడ‌న‌లో వైసీపీ నుంచి పోటీ చేస్తోన్న మాజీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ వ‌ర్గం కేపీకి ఎంత వ‌ర‌కు స‌పోర్ట్ చేస్తుందో ? అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ఇక్కడ జనసేన తరుపున పోటీ చేస్తున్న అక్కల రామ్మోహన్ రావు...కాపు ఓటర్లు, పవన్ అభిమానులు పైనే ఆధారపడి ఉన్నారు. అయితే జనసేనకి గెలిచే అంత సత్తా లేదుగాని.. కొంతవరకు ఓట్లు చీల్చే అవకాశం మాత్రం ఉంది. మరి ఆ ఓట్ల చీలిక ఎవరికి నష్టం తెస్తుందో ఇప్పుడే చెప్పలేం.


ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉమాతో సంబంధం లేకుండా ఎంపీ కేశినేని నానికి అనుకూలంగా కొంత వ‌ర‌కు క్రాస్ ఓటింగ్ జ‌రిగే ఛాన్సులు ఉన్నాయి. ఎమ్మెల్యేకు కేపీకి ఓటు వేసిన వారు కూడా ఎంపీకి కేశినేనిని ఓటు వేస్తార‌న్న ప్రచారం టీడీపీ వ‌ర్గాల్లోనే జ‌రుగుతోంది. మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, జి. కొండూరు, రెడ్డిగూడెం, మైలవరం మండలాలతో పాటు విజయవాడ గ్రామీణ మండలంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ బీసీల ఓట్లు దాదాపు 1.20 లక్ష ఉన్నాయి. వీరి తర్వాత కమ్మ 40వేలు, ఎస్సీ 40 వేలు ఓట్లు ఉన్నాయి. కాపులు, రెడ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. అయితే బీసీ, కమ్మ, ఎస్సీలే అభ్యర్ధుల భవితవ్యాన్ని నిర్ణయించగలరు. మొత్తం మీద చూసుకుంటే దేవినేని-వసంతల మధ్య హోరాహోరీ పోరు అయితే జరగనుంది. ఇద్దరికీ గెలిచే అవకాశాలు సమానంగానే ఉన్నాయి. మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: