మెదక్...తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సొంత ఇలాకా. తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ముఖ్యమైనది మెదక్ లోక్‌సభ నియోజకవర్గం. ఈ లోక్‌సభ పరిధిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండడం విశేషం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకునేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, బీజేపీ నుంచి ప్రముఖ న్యాయవాది ఎం రఘునందనరావు పోటీపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ గట్టిగా జరుగుతోంది. అయితే, ఇక్కడ గులాబీ గెలుపు సమస్య కాదని....మెజార్టీ దక్కించుకోవడమే అసలు టార్గెట్ అని విశ్లేషకులు అంటున్నారు.

 


ప్రముఖ పార్లమెంటు నియోజకవర్గమైన మెదక్ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ గెలుపుకోసం ఆయన అహర్నిశలు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నర్సాపూర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ రోడ్‌షోలను నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందు వల్ల ఈ సీటులో టీఆర్‌ఎస్‌ను పెద్ద మెజార్టీతో గెలిపించేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. కాగా ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు వారంరోజులు ఉండడంతో ఎవరికి వారు తమ గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి గెలుపు గురించి ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్యులైన హరీశ్ రావు, కేటీఆర్ చాలెంజ్ విసురుకున్నారు. మెదక్ కంటే తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా పార్లమెంటు నియోజకవర్గమైన కరీంనగర్ లో ఎక్కువ మెజార్టీ సాధిస్తానని కేటీఆర్ ప్రకటించారు.

 


 

మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, సిద్ధిపేట, గజ్వేల్, పటాన్ చెరు, సంగారెడ్డి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సంగారెడ్డి మినహాయించి మిగిలిన ఆరు చోట్ల టీఆర్‌ఎస్ అభ్యర్థులు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల తీరును విశ్లేలషిస్తే ఓటర్లు గత 16 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలను అక్కున చేర్చుకున్న చరిత్ర కనపడుతుంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ సీటు నుంచి 1980లో పోటీ చేసి గెలవడం విశేషం. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సార్లు ఈ సీటు నుంచి గెలిచింది. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏ నరేంద్ర, అంతకుముందు 1984 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలిచారు. 1952లోపీడీఎఫ్ అభ్యర్థి, 1957, 62,67, 77, 80, 89,91, 96, 98 ఎన్నికల్లో కాంగ్రెస్, 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి, 1999 ఎన్నికల్లో బీజేపీ, 2004, 2009, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. 2014లో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సీటునుంచి గెలిచి, సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకరరెడ్డి గెలిచారు.

 

మెదక్ పార్లమెంటు పరిధిలో మొత్తం 15.95 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి తగినంత బలం ఉంది. 1999 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నరేంద్ర గెలవడం విశేషం. 2014 ఉప ఎన్నికల్లో బీజేపీకి 1.86 లక్షల ఓట్లు, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 1.81 లక్షల ఓట్లు పోలయ్యారు. ప్రధాని మోదీ పరిపాలన, బీజేపీ సాధించిన విజయాలు, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం తమకు కలిసివస్తుందనే ఆశతో బీజేపీ ఉంది. గత ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 5.71 లక్షల ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి 2.10 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా పరిణామాలను విశ్లేషిస్తే సునీతా లక్ష్మారెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో, గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: