తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్య హోరాహోరీ పోరు నియోజకవర్గాల్లో కాకినాడ సిటీ ఒకటి. ఇక్కడ మూడు పార్టీల అభ్యర్ధులు బలంగా ఉన్నారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు ఖాయమైంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) పోటీ చేస్తుండగా...వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జనసేన నుంచి ముత్తా శశిధర్ బరిలో ఉన్నారు. 2014లో 24వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన టీడీపీ అభ్యర్ది కొండబాబుకి...ఈసారి గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. ఐదేళ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబుపై  ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది.  పైగా కాకినాడ కార్పొరేషన్‌లో సులువుగా విజయం సాధించిన టీడీపీకి...ఇప్పుడు అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. 


అయితే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత కనిపిస్తోంది. అవే ఇప్పుడు టీడీపీకి అండగా ఉండనున్నాయి. ఇక వైసీపీ అభ్యర్ధి ద్వారంపూడి చంద్రశేఖర్‌...2009లో ఎమ్మెల్యేగా పని చేశారు. అప్పుడు చేసిన అభివృద్ధి ద్వారంపూడికి కలిసొచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఐదేళ్లు ప్రతిపక్షనేతగా ప్రజల్లోనే ఉంటూ...పార్టీని బలోపేతం చేశారు. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ బలం పుంజుకుంది. అయితే జనసేన కూడా పోటీలో ఉండటంతో రెండు పార్టీలలో టెన్షన్ మొదలైంది. జనసేన ఎవరు ఓట్లు చీలుస్తుందో అని భయపడుతున్నారు. ఇక్కడ కాపులు ఎక్కువ ఉండటం, పవన్ ఇమేజ్ ముత్తా శశిధర్‌కి ప్లస్ అవుతాయి. అదే టైంలో సిటీలో శ‌శిధ‌ర్ వ‌ర్గానికి చెందిన వైశ్య ఓట‌ర్లు కూడా ఎక్కువే. వీరు కూడా జ‌న‌సేన‌కు ఓటేస్తే జ‌న‌సేన ప్ర‌ధాన పార్టీల‌కు షాక్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కాపు + వైశ్య ఈక్వేష‌న్ జ‌న‌సేన‌కు బ‌లం.


2009లో ప్రజారాజ్యం అభ్యర్ధికి దాదాపు 35వేల ఓట్లు వరకు వచ్చాయి. దీనే బట్టే అర్ధం చేసుకోవచ్చు జనసేన ఏ మేర ప్రభావం చూపుతుందో. ఇక నియోజకవర్గంలో మత్య్సకార వర్గం ఎక్కువగా ఉంది. తర్వాత కాపులు, దళితులు అధికంగా ఉన్నారు. టీడీపీ అభ్యర్ది మత్య్సకార వర్గం కాగా, వైసీపీ అభ్యర్ధి రెడ్డి, జనసేన అభ్యర్ధి వైశ్య. అయితే ఎన్నికల ముందు వరకు టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్న.. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. వనమాడి మత్య్సకార వర్గం అయినా...వారంతా ఏకపక్షంగా ఆయనకి మద్ధతు ఇవ్వడం కష్టమే. పైగా వైసీపీ-జనసేన అభ్యర్ధులు బలంగా ఉన్నారు. ఏది ఏమైనా మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనపడుతుంది. కానీ గెలుపు మాత్రం టీడీపీ-వైసీపీ అభ్యర్ధుల్లో ఒకరికి దక్కే అవకాశం ఉంది. మరి చూడాలి ఈ టఫ్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో.  



మరింత సమాచారం తెలుసుకోండి: