ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమై 4 గంటలు అయింది. అయితే, ఈ నాలుగు గంటల్లోనే ఎన్నికల సంఘం చాలా అప్రతిష్టను మూటగట్టుకుంది. చాలా చోట్ల ఈవీఎంలు మొరా యించడం, అసలు ఓటింగ్‌ ప్రక్రియే ప్రారంభం కాకపోవడం వంటి పరిణామాలు తలెత్తాయి. వాస్తవానికి నాలుగు నెలల కిందట పక్కరాష్ట్రం తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి తప్పులే దొర్లాయి. అయితే, వాటి నుంచి పాఠం నేర్చుకోవాల్సిన ఎన్నికల సంఘం మొద్దునిద్రపోయింది. అక్కడి సమస్యలను తనకు అన్వయం చేసుకుని ఏపీలోనూ ఇలాంటి సమస్యలు వస్తే ఏంచేయాలనే విషయంపై దృష్టి పెట్టలేదు. దీంతో సమస్యలు మొదటికి వచ్చాయి. 


ఎప్పటికప్పుడు ప్రజలకు మీరిలా ఓటేయండి... మీరిలా ఓటు హక్కును వినియోగించుకోండి.. ఓటు వేయక పోవడం మహాపాపం.. ఓటరూ మేలుకో.. అంటూ నీతులు వల్లించిన ఎన్నికల సంఘం తీరా తన బాధ్యతలు నిర్వర్తించడంలో మాత్రం చతికిల పడిపోయింది. ఈవీఎంల పనితీరునే అప్రతిష్టపాలు చేయడంతో పాటు ఏకంగా ఈవీఎంలపై నమ్మకం పోయేలా చేసింది. ఈ పరిణామం ప్రజాస్వామ్య వాదులను కలచి వేసేదే. అయితే, ఎక్కడైనా ఎప్పుడైనా సంయమనం అవసరం. కానీ, ఏపీ అధికార పార్టీ నేత, సీఎం చంద్రబాబు మాత్రం ప్రతి విషయాన్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 


తాజాగా ఎన్నికల ప్రక్రియలతో తలెత్తిన లోటుపాట్లపై ఆయన అప్పుడే గళం ఎత్తారు. దీనిని ఎవరూ తప్పుపట్ట రు. ఎన్నికల సంఘంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అస‌లు ఈ ఎన్నిక‌ల‌కు మేము అంగీక‌రించ‌మ‌ని ఆయ‌న చెపుతుండ‌డం విడ్డూరంగా ఉంది. కానీ, ఈసీ తప్పులను సాకుగా చూపుతూ.. అధికారంలో ఉన్న చంద్రబాబే ఓ విపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికలను మరోసారి నిర్వహించాలని కోరడాన్ని ప్రతి ఒక్కరూ హేళన చేస్తున్నారు. సీఎం స్థాయిని మరిచి చంద్రబాబు రోడ్డెక్కుతున్నారని, ఏవైనా సమస్యలు వస్తే.. వాటికిపరిష్కారం చూపాలే తప్ప మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు ఒకటి మాట్లాడడం ప్రజలతో ఆడుకోవడం కిందకే వస్తుందని అంటున్నారు. ఏదేమైనా చంద్రబాబు శైలిపై తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. అసలు రీపోలింగ్‌ డిమాండ్‌ వెనుక బాబు భీతి ఏంటనే విషయంపై చర్చ సాగుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: