రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద వెల్లువెత్తారు. అయితే ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గం కుప్పంలో మాత్రం చాలా తక్కువగానే నమోదైంది. కుప్పలంలో నమోదైన ఓటింగ్ శాతం 67. 2 మాత్రమే అంటే ఆశ్చర్యంగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఓటింగ్ సగటు సుమారుగా 70 నమోదైంది. అలాంటిది ఇంత కీలక ఎన్నికల్లో కూడా స్వయంగా చంద్రబాబే ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో మాత్రం అంత తక్కువగా ఉండటమే అనుమానంగా ఉంది.

 

మామూలుగా పార్టీల అధినేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ బాగా ఎక్కువగా జరగాలి. వైసిపి అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలోని పులివెందులలో పోలింగ్ శాతం 81 నమోదైంది. పోయిన ఎన్నికల్లో ఇక్కడ నమోదైన ఓటింగ్ శాతం 79. మరి అదే కుప్పం విషయానికి వస్తే నమోదైన ఓటింగ్ 67 మాత్రమే. ఇదే నియోజకవర్గంలో పోయిన ఎన్నికలో  నమోదైన ఓటింగ్ శాతం 83.33 .

 

 

అదే విధంగా జనసేన అధినేత పోటీ చేసిన విశాఖపట్నం జిల్లా గాజువాకలో కూడా ఓటింగ్ శాతం తక్కువగానే కనిపిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ ఓట్లేసింది కేవలం 60 శాతం మాత్రమే. పోయిన ఎన్నికల్లో ఇక్కడ నమోదైంది 64.31 శాతం మాత్రమే. అలాగే రెండో నియోజకవర్గం భీమవరంలో కూడా నమోదైంది 68.20 శాతం మాత్రమే. 2014 ఎన్నికల్లో 77. 27 శాతం నమోదైంది. అంటే పోయిన ఎన్నికల్లో కన్నా తాజా ఎన్నికల్లో ఓటింగ్ 9  శాతం తగ్గటం గమనార్హం.

 

మామూలుగా అయితే తమ అధినేతలను గెలిపించుకోవాలన్న ఉత్సాహం ఉన్నపుడే ఓటర్లు చాలా చురుగ్గా ఓటింగ్ లో పాల్గొంటారన్న విషయం అందరికీ తెలిసిందే.  పులివెందులలో 81 శాతం ఓటింగ్ నమోదైందంటే ఓటర్లలో ఆ ఉత్సాహం కనబడుతోంది. మరి అదే ఉత్సాహం కుప్పంలో కానీ గాజువాక లేకపోతే భీమవరం ఓటర్లలో ఎందుకు కనబడలేదు ?

 

ఇక్కడే విశ్లేషకులు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. తక్కువ ఓటింగ్ శాతం నమోదవ్వటమంటే ఓటర్లలోని అనాసక్తికి నిదర్శనమట. కాబట్టి ఓటింగ్ శాతం నమోదును బట్టి కుప్పంలో చంద్రబాబుకైనా లేకపోతే భీమవరం, గాజువాకలో పోటీ చేసిన పవన్ కల్యాణ్ కైనా ఓట్లు తక్కువ పడే అవకాశం ఉందని తేలుతోంది.  చంద్రబాబు, పవన్ కే ఓట్లు తక్కువ పడితే ఇక వాళ్ళని నమ్ముకుని పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్ధుల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: