వన్ సైడ్ అయినా... సూసైడైనా, ఎందుకు మనల్ని సీమాంద్ర ప్రజలు, ఉద్యోగులు నమ్మడంలేదు, మనమెక్కడ పొరపాటు చేసాం, మిగిలిన పార్టీలకంటే ఎక్కువగానే ఉద్యమబాట పట్టాం, అయినా ఎందుకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం.... ఇవి వైఎస్సార్ సిపి మదిని తొలుస్తున్న ప్రశ్నలు. ప్రత్యర్థి పార్టీ నేతలు ఈ మాటలు అంటే ఆరోపణలు అని కొట్టిపారేసే వాళ్లం, కాని ఈ మాటలన్నది ఆ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్న షర్మిల.

రహస్యంగా గుసగుసలు పెట్టిందా... అంటే అదీ కాదు, ఏకంగా పార్టీ కో- ఆర్డినేటర్ల సమావేశంలో వేదికపై నుంచి చేసిన ప్రసంగంలోనే ఈ మాటలు నొక్కి వక్కానించింది. ప్రజల్లోకి నేరుగా వెల్లిన షర్మిల ఈ మాటలందంటే ఆమెకు ప్రజల్లో పార్టీ పరిస్థితి పూర్తిగా అర్థమయినట్టే. అంటే పార్టీని తెలంగాణలో త్యాగం చేసి సీమాంధ్రకు పరిమితం చేసినా కూడా ప్రజల నమ్మకాన్ని వైఎస్సార్ సిపి అంతగా పొందలేదన్నది సుస్పష్టం. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి, కాదుకాదు ఆ పార్టీ భవిష్యత్తుపైనే ఆదారపడ్డ జగన్ సిచువేషన్ ఏంటి.

అది బలంగా ఉంటేనే ఆయనకు అధికారం రావాలి, అది వస్తుందని తెలిసి కాంగ్రెసో, బిజేపో ఇంకా ఏదైనా కూటమో జగన్ ను దగ్గరికి తీయాలి, పీకలదాకా ఇరుక్కున్న కేసుల నుంచి బయటపడేయాలి, అదే లేకుంటే జగన్ ను దగ్గరికి తీసుకునే వారెవ్వరు. అందుకే ఇప్పుడు షర్మిల మాటలు జగన్ గుండెల్లో తూటాలుగా పేలాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పైగా షర్మిల మరి కొన్ని చేదు నిజాలు కూడా చెప్పిందట.

తెలుగుదేశం పార్టీని సీమాంద్రలో అడ్రస్ లేకుండా చేయాలనుకున్నాం, ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సహా నేతలెవరు రోడ్డుపైకి రాకుండా జనం తో తరిమికొట్టించాలనుకున్నాం, దీని కోసం అమ్మ, జగనన్న నిరవధిక దీక్షలు చేసారు, నేను రికార్డు బ్రేకు చేస్తూ యాత్రలు చేసాను, మనమే గొంతు చించుకుని చంద్రబాబును తరిమికొట్టండి అని పిలుపినిచ్చాం, అయినా సరే బాబు ను ఎవరు అడ్డుకోలేదు, ఆయన యాత్రకు జనం వచ్చారు. ఇక మనమేం సాధించామన్నట్టు, దీనికి మన కో- ఆర్డినేటర్ల చేతకాని తనం కారణం కాదా అని షర్మిల ఫైర్ అయ్యారట.

అంతెందుకు సమైక్యం కోసం ఉద్యోగులకంటే ముందునుంచి మనం ఉద్యమంలోకి దిగితే ఏపిఎన్జీఓలు మన ఊసే పట్టించుకోవడం లేదు, హైదరాబాద్ ఏపి సేవ్ సభకు సిపిఎం, ఎంఐఎం లను ఆహ్వానించారు, విజయవాడ సభకు కూడా వారిని పిలిచారు, కాని మనల్ని ఎందుకు పిలవలేదు, అంటే మనపై వారికి విశ్వాసం లేదని తెలుస్తోంది కదా... అందుకే ఇప్పటి నుంచైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయండి, సీమాంధ్రలో మనం సమైక్యం కోసం చేస్తున్న పోరాటం, చేసిన త్యాగాలు వివరించండి అందట షర్మిల. నిజాలు తెలుసుకున్నారు కాబట్టి నివారణ చర్యలు ఏమేరకు తీసుకుంటారు, ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది వేచిచూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: