ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత  టీడీపీ ఓటమి ఖాయమైందని బాబు గ్రహించారని అన్నారు. ఓటు వేసి వచ్చిన తరువాత గంట రెండు గంటల్లోనే ముప్పై శాతం ఈవీఎంలు పని చెయలేదని అసత్యపు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. 5 కోట్లు ఇస్తే ఈవీఎంలు మేనేజ్ చేస్తామని తన దగ్గరికి వచ్చారని చెప్పటం చూస్తే బాధ్యతయుత పదవిలో ఉన్న వ్యక్తి కార్యాలయం దొంగలకు అడ్డాగా మారిపోయిందనే విషయాన్ని బాబు వెల్లడించాలన్నారు. ఈదేశంలో ఈవీఎంల దొంగల ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ టీడీపీ నేతలు మాత్రమేనని విష్ణువర్దన్​ రెడ్డి అన్నారు.


ఐటీ గ్రిడ్ దొంగలు కూడా టీడీపీ నేతలేనని విష్ణువర్దన్​ రెడ్డి చెప్పారు. ఆంద్రప్రదేశ్ దొంగలంతా చంద్రబాబు పక్కనే ఉన్నారు అని మండిపడ్డారు. ఈవీఎంలు,ఐటీ గ్రిడ్ చోరులకు కేరాఫ్ అడ్రస్ టీడీపీ అని ఆరోపించారు. ఈ విషయంలో చంద్రబాబు వివరణ ఇవ్వాలి అని డిమాండ్​ చేశారు. ‘దేశంలో ఉన్న ప్రతిపక్షాలను కలుస్తా అని డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో కేఏ పాల్ కామెడీ చంద్రబాబు కామిడి రెండు ఒకటే. నా ఓటు నాకే పడిందో లేదో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివిఫ్యాట్స్లు కావాలని చెప్పింది చంద్రబాబే కదా ఇప్పుడేమైంది? మహంతి కుటుంబానికి మంచి పేరు ఉంది అలాంటి అతన్ని కడప నుండి ఎందుకు బదిలీ చేశారు?’ అని సూటిగా ప్రశ్నించారు.

వ్యవస్థలో పని చేసే ఏ ఒక్క అధికారిని గౌరవించరని విష్ణు ఆరోపించారు. ‘‘ఈడీ, సీబీఐ లు రావొద్దని జీవో లు ఇస్తాడు. టీడీపీ నేతలు ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. తిట్ల దండకంతో టీడీపీ కి ఓట్లు వేస్తారా. మోడీని తిడితే ఓట్లు పడవు. ప్రభుత్వ ఉద్యోగులను ఇంట్లో పని మనుషుల్లాగా చూస్తారు. ఇలాంటి వాటిని చూస్తే బాబు మానసిక స్థితిపై అనుమానం కలుగుతుంది. చంద్రబాబు చెల్లని రూపాయి. ఈవీఎంల పేరుతో ఢిల్లీ లో డ్రామా మొదలుపెట్టారు బాబు.  అమరావతి నుండి ఢిల్లీ కి దుకాణం మార్చారు.ఆంధ్ర లో చెల్లని రూపాయి దేశంలో ఏ రాష్ట్రంలో చెల్లుతుంది’ అని ఎద్దేవా చేశారు.

తెలంగాణలో టీడీపీ జెండా పీకారు, ఆంధ్రలో జెండా ఎత్తేశారు అని విష్ణువర్దన్​ రెడ్డి అన్నారు. ‘టీడీపీలో ఏ ఒక్కరు మిగలరు.. టీడీపీకి ఓటేస్తే బీజేపీ కి పడుతుంది అంటున్న మీరు మాకు ఒకవేళ ఓట్లు రాకపోతే ఈవీఎంలను బాబు మేనేజ్ చేసినట్టేనా? నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీఎస్ ను బెదిరిస్తున్నారు..2014 ఎన్నికల్లో డీజీపీ తప్పించాలని లేఖ రాసి మార్పించుకున్నారు. కానీ ఇప్పుడు మారిస్తే తప్పా?రికార్డుల టాంపరింగ్​పై విచారణ జరపాలి. టీడీపీ నేతలు ఓటమి పాలవుతున్నామని తెలిసి ఇష్టానుసారంగా ప్రవర్తించారు’ అని వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: