ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత చంద్రబాబు ఈసీ తీరును ఉతికి ఆరేస్తున్నారు. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఏపీలో ప్రెస్ మీట్ పెట్టి.. ఈసీ తీరును తూర్పారబట్టారు. ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ వెళ్లి అక్కడ కూడా ఈసీ అక్రమం..అన్యాయం అంటూ జోరుగా మాట్లాడారు. మొత్తం దేశంలోని పార్టీలను ఏకం చేసి అన్ని పార్టీలతోనూ యాభై శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అనే డిమాండ్ వినిపించారు.


అయితే చంద్రబాబు తీరును చాలా మంది అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంది. చంద్రబాబు ఓడిపోబోతున్నాడని.. అందుకే ఈ స్థాయిలో ఈవీఎంల తీరును తప్పుబడుతున్నారని ఓ వాదన ఉంది. తన ఓటమికి చంద్రబాబు కారణాలు వెదుక్కుంటున్నారని చాలామంది నాయకులు కూడా విమర్శిస్తున్నారు.


కానీ.. అలా ఆలోచిస్తే.. చంద్రబాబు నలభయ్యేళ్ల రాజకీయాన్ని తక్కువ అంచనా వేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.

చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై జాతీయ స్థాయిలో ఉద్యమించడం వెనుక చాలా పెద్ద స్కేచ్చే ఉంది. రేపు ఏపీలో ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే... జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఉద్యమాలు చేయడం చంద్రబాబు స్థాయికి తగని పని. అందుకే ఆయన ఓడిపోగానే జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారు. అందుకు ఇప్పటి ఈవీఎం ఉద్యమం ఓ భూమిక అవుతుంది.


ఒకవేళ గెలిస్తే.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. ఓ ఏడాదో..ఏడాదిన్నరో పాలించి.. తర్వాత పార్టీ పగ్గాలు, సీఎం కుర్చీ రెండూ లోకేశ్‌ కు అప్పగించే అవకాశం పుష్కలంగా ఉంది. దానికి కూడా ఈ ఈవీఎం ఉద్యమం కీలక భూమిక అవుతుంది. అందుకే చంద్రబాబు ఈ స్థాయిలో ఉద్యమిస్తున్నారు. ఇదీ అసలు సంగతి. ఈ విషయం తెలియని చాలా మంది ఓడిపోతున్నారని తెలిసే.. చంద్రబాబు ఇలా డ్రామాలాడుతున్నారని అమాయకంగా తక్కువ అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: