మొన్ననే జరిగిన పోలింగ్ లో గ్రేటర్ రాయలసీమలో వైసిపి స్వీప్ చేయనుందని సమాచారం. గ్రేటర్ రాయలసీమలోని ఆరు జిల్లాల నుండి సేకరించిన వివరాల ప్రకారం పోయిన ఎన్నికల్లో వైసిపికి వచ్చిన సీట్లకన్నా రేపటి ఫలితాల్లో మంచి నెంబరే సాధిస్తుందట. నిజంగా చెప్పాలంటే ఒకవిధంగా స్వీప్ చేస్తుందని కూడా అంచనా వేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని మొత్తం 74 సీట్లలో వైసిపి ఏకంగా 60 సీట్లు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ ప్రకారం అంచనా వస్తోంది.

 

రాయలసీమలోని నాలుగు జిల్లాలు చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కలుపుకుని గ్రేటర్ రాయలసీమ అంటారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తలా 14 సీట్లున్నాయి. కడపలో 10 సీట్లున్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలుండగా నెల్లూరు జిల్లాలో 10 స్ధానాలున్నాయి.

 

ఒక ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో వైసిపికి 11 సీట్లు వస్తాయట. టిడిపికి రెండు సీట్లు వస్తుండగా పలమనేరు ఫలితం అంచనా వేయలేకపోయారు. ఇక కడప జిల్లాలోని పది సీట్లలో 9 సీట్లు ఖాయమట. కాకపోతే జమ్మలమడుగు నియోజకవర్గం ఫలితమే ఎటూ తేల్చలేకపోతున్నారు. కర్నూలులోని మొత్తం 14 నియోజకవర్గాల్లో ఒక్క ఆళ్ళగడ్డ తప్ప మిగిలిన 13 స్ధానాలూ వైసిపి ఖాతాలోనే పడతాయట. అనంతపురంలోని 14 నియోజకవర్గాలకు గాను వైసిపికి 11 వస్తాయట. టిడిపికి రెండు నియోజకవర్గాల్లో గెలుస్తాయని చెబుతున్నారు. తాడిపత్రిలో ఫలితం సస్పెన్సే.

 

ఇక నెల్లూరు జిల్లాలోని 10కి  10 సీట్లూ వైసిపికే దక్కుతాయంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో వైసిపికి పది సీట్లు వస్తాయంటున్నారు. మిగిలిన రెండు సీట్లు మాత్రం టిడిపి ఖాతాలో పడతాయట. పోయిన ఎన్నికల్లో కూడా గ్రేటర్ రాయలసీమలో వైసిపి మంచి ఫలితాలు రాబట్టింది. రాయలసీమ జిల్లాల్లో ఒక్క అనంతపురం తప్ప మిగిలిన మూడు జిల్లాలు టిడిపిని బాగా ఆదుకున్నాయి. అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా వైసిపికి మద్దతుగా నిలబడ్డాయి. కాకపోతే ఫిరాయింపులను ప్రోత్సహించటంతో వ్యవహారం కంపయ్యింది.


గ్రేటర్ రాయలసీమ పరిధిలోని 74 సీట్లకు గాను వైసిపి 60 సీట్లతో స్వీప్ చేస్తే ఫ్యాన్ స్పీడు ఇక్కడికి మాత్రమే పరిమితం కాదు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా స్వీప్ చేస్తుంది. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఉభయగోదావరి జిల్లాలు కూడా గాలి గట్టిగానే వీయాలి. అదే జరిగితే వైసిపికి తక్కువలో తక్కువ 140 సీట్లు వస్తుందన్నది ఓ అంచనా. మరి ఏమవుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: