తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎంత భిన్న‌మైన నేత అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి మిగ‌తా నాయ‌కుల‌తో పోలిస్తే, ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటుంది. అలాంటి ప్ర‌త్యేకత‌ను మ‌రోమారు కేసీఆర్ ప్ర‌దర్శించారు. తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఓడిపోయిన ఎమ్మెల్యేల‌కు ప‌ద‌వులు ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. 



ఈ సమావేశంలో జిల్లా పరిషత్‌, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్‌ విస్తృతంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించి..గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో అన్ని జడ్పీ స్థానాల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా వ్యూహాత్మంగా ముందుకెళ్లాలని సూచనలు చేశారు. 



ఈ స‌మ‌యంలోనే కేసీఆర్‌ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు జెడ్పీ చైర్మన్ అఫర్ ఇచ్చారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని తొలి అభ్యర్థిగా ప్రకటించగా పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకి చైర్మన్ అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరే కాకుండా అవకాశం ఉన్నచోట ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శులకు కూడా జిల్లాల బాధ్యతలను అప్పగించనుండగా జెడ్పీలను గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేలకు, మంత్రులకు అప్పగించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: