చంద్రబాబునాయుడులో ఎందుకో ఆత్మస్ధైర్యం దెబ్బతిన్నట్లే ఉంది. పోలింగ్ అయిపోయిన దగ్గర నుండి తన సహజ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును దగ్గర నుండి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి రెస్పాన్స్ ను ఊహించలేదు. పోలింగ్ మొదలైన రెండు గంటలకే చంద్రబాబు రీపోలింగ్ జరగాలంటూ డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. ఈవిఎంలు మొరాయించటం వల్ల కొద్ది పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ లో జాప్యం  అయ్యిందే తప్ప మరే నష్టం జరగలేదు.

 

పోలింగ్ అయిపోయింది. రికార్డుస్ధాయిలో  80 శాతం పోలింగ్ జరిగింది. పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లో భారీ పోలింగ్ నమోదైంది. అంత భారీగా పోలింగ్ నమోదైన తర్వాత అనూహ్యంగా ఈవిఎంల మీద చంద్రబాబు గగ్గోలు పెట్టేస్తున్నారు. చంద్రబాబు గోల చూసిన వాళ్ళందరికీ టిడిపి ఓడిపోతోందనే సంకేతాలను చంద్రబాబే పంపుతున్నారు. మామూలు జనాలే కాదు పార్టీ నేతలు కూడా బాగా డీలా పడిపోతున్నారు.

 

ఒకవైపు ఈవిఎల పనితీరుమీద చంద్రబాబు గోల చేస్తుంటే మరోవైపు నేతలు టిడిపి అధికారంలోకి వస్తుందని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. ఓటింగ్ అయిపోయిన తర్వాత జనాల తీర్పు ఈవిఎల్లో నిక్షిప్తమైపోయింది. మరి జనాల తీర్పేమిటో తెలియకుండానే చంద్రబాబు ఎందుకంత గగ్గోలు పెట్టేస్తున్నారు ?  ఈవిఎంల విషయంలో గోల చేయటం ద్వారా తన ఓటమిని తానే అంగీకరించేసినట్లేనా ? అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయ్.

 

చంద్రబాబు గురించి అందరికీ తెలిసిందేమిటంటే ఓటమిని ఓ పట్టాన ఒప్పుకునే రకంకాదు. కింద పడ్డా పై చెయ్యి తనదే అనే రకం చంద్రబాబు. అలాంటిది చంద్రబాబు వైఖరి వల్ల పోలింగ్ జరుగుతుండగనే కాడిని దించేసినట్లు అయిపోయింది.  ఈవిఎంలపై రచ్చ చేయటం, ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీపై కోర్టుకు వెళ్ళటం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చేయటంతో  చంద్రబాబుకు పిచ్చెక్కినట్లైపోయింది.

 

ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీతోనే చంద్రబాబుకు ఒక చెయ్యి పడిపోయినట్లైంది. దానికితోడు ముగ్గురు ఎస్పీలను మార్చేయటంతో చంద్రబాబు బాగా డీలా పడిపోయారు. జరిగినది చూస్తుంటే చంద్రబాబు పార్టీ నేతలకన్నా అధికారయంత్రాంగం మీదే గెలుపుపై ఎక్కువగా ఆధార పడ్డారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్నది చూస్తుంటే చంద్రబాబులో ఆత్మస్ధైర్యం దెబ్బతిన్నట్లే కనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: