ఎన్నికల నేపధ్యంలో ఒకవైపు ఎన్నికల కమీషన్ చంద్రబాబునాయుడుకు షాక్ ఇస్తుంటే అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా మంత్రులకు, ఎంఎల్ఏలకు ఝులక్ ఇస్తున్నట్లు సమాచారం. తనిష్టం వచ్చినట్లు ఎన్నికలను నిర్వహించుకుని మళ్ళీ అధికారంలోకి రావాలన్న చంద్రబాబు ప్లాన్ దాదాపు బెడిసికొట్టిన విషయం తెలిసిందే. ఎప్పుడైతే ప్లాన్ బెడిసికొట్టిందో అప్పటి నుండి ఈసితో పాటు వైసిపి, మోడిపైన కూడా మండిపోతున్నారు చంద్రబాబు.

 

సరే ఆ విషయాన్ని పక్కన పెడితే పోలింగ్ అయిపోయింది కాబట్టి మెల్లిగా మంత్రులు తమ చాంబర్లపై దృష్టిపెట్టారట. తమ కార్యాలయాలకు వచ్చి పెండింగ్ లో ఉన్న పనులు, వివిధ పనుల మంజూరు తదితరాలపై  ఆదేశాలిస్తున్నట్లు సమాచారం. అయితే మంత్రుల ఆదేశాలను పాటించేది లేదని అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారట. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా కొత్త పనులేవీ తాము మంజూరు చేయలేమని, నిధుల ఎలకేట్ చేయలేమని కూడా తేల్చి చెప్పేస్తున్నారట.

 

పోలింగ్ జరిగిన దగ్గర నుండి కాబోయే సిఎం జగన్మోహన్ రెడ్డే అంటూ జరుగుతున్న ప్రచారం అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్లే చంద్రబాబు వ్యాఖ్యలు, చేష్టలు కూడా అదే విషయాన్ని బలపరుస్తున్నాయి. దాంతో అధికారయంత్రాంగం ముందు జాగ్రత్త పడింది. దానికితోడు నిబంధనలను అతిక్రమించిన అధికారులపై  ఎన్నికల కమీషన్ కూడా కొరడా ఝుళిపిస్తోంది. దాంతో యంత్రాంగంలో దడ మొదలైంది. అందుకనే మంత్రులు చెప్పిన పనులు చేసి ఇరుక్కోవటం ఎందుకన్న ఆలోచనతో మంత్రులు ఏమి చెప్పినా కుదరదని చెప్పేస్తున్నారట.

 

పోలింగ్ కు ఫలితాలకు మధ్య 42 రోజుల వ్యవధి ఉంది. నిజానికి ఇంతకాలం వ్యవధి ఉంటే అధికారంలో ఉన్న పార్టీకి ఇబ్బందే. ఎందుకంటే, పోలింగ్ ముగిసినా ఫలితాలు వచ్చే వరకూ ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. ఆ వ్యవధిలో అధికారులు విధులు నిర్వర్తించటం కత్తిమీద సాములాంటిదే. ఉన్న పార్టీని కాదనలేరు, అధికారంలోకి రాబోతోందనే పార్టీతో వైరం తెచ్చుకోలేరు. ఇపుడు జరుగుతున్నది అదే. దాంతో మంత్రులకు ఏమి చేయాలో అర్ధంకావటం లేదు. అందరూ వెళ్ళి చంద్రబాబుతో మొరపెట్టుకుంటున్నారు. మరి చంద్రబాబు మాత్రం ఏం చేస్తారు పాపం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: