దేశ రాజ‌కీయాల‌ను కీల‌క మ‌లుపు తిప్పే ఎపిసోడ్ చోటుచేసుకుంది. ఢిల్లీకి షార్ట్‌క‌ట్ వేదిక అనే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో 24 ఏళ్ల తర్వాత ఓ అద్భుతం ఆవిష్కృతం అయింది. ఒకప్పటి బద్ధ శత్రువులు.. ఇవాళ ఒకే వేదికను పంచుకున్నారు. అది ఎవరంటే.. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్‌ యాదవ్‌.. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి. ఈ ఇద్దరు నేతలు 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకోబోతుండడం విశేషం. ములాయం సింగ్‌ పోటీ చేస్తున్న మెయిన్‌పూరి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీలో ములాయం, మాయావతితో పాటు ఆర్‌ఎల్డీ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ పాల్గొననున్నారు. 


ఈ ఇద్ద‌రు నేత‌లు ఒకేతాటిపైకి రావ‌డం కీల‌క ప‌రిణామంగా పేర్కొంటున్నారు. 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరాం, ములాయం సింగ్‌ కలిసి ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నాటి ఎన్నికల్లో ఎస్పీకి 109, బీఎస్పీకి 67 స్థానాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 177 స్థానాలు సాధించినప్పటికీ.. ఎస్పీ - బీఎస్పీలు, చిన్నాచితకా పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే వీరి సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. దీనికి క‌ల‌హాలే కార‌ణంగా మారాయి.


సంకీర్ణ స‌ర్కారు కూలిపోయే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని ప‌లువురు అనుమానప‌డ్డారు. 1995లో మాయావతి బీజేపీతో చర్చలు జరుపుతోందన్న సమాచారం అందడంతో ఎస్పీ నాయకులు అప్రమత్తమయ్యారు. ఓ గెస్ట్‌ హౌజ్‌లో బీఎస్పీ సమావేశం జరుగుతుందని తెలుసుకున్న ఎస్పీ కార్యకర్తలు అక్కడికెళ్లి బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. మాయావతి వారి దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించగా.. అనంతరం ఇరు పార్టీలు విడిపోయాయి. నాటి నుంచి నేటి వరకు ములాయం, మాయావతి మద్య మాటలు కూడా లేవు. మొత్తానికి 24 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీల‌కు వ్య‌తిరేకంగా వేదిక నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: