రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కులాల ప్రాబ‌ల్యం తక్కువ. ఏపీలో రాజకీయ అంతా కులాల రొచ్చులో చిక్కుకుపోయి ఉంటుంది. తెలంగాణలో గత ఎన్నికల వరకు కులాల ఆలోచన జనాల మెదళ్ల‌లో పెద్దగా లేకపోయినా గత ఎన్నికల్లో మాత్రం రెడ్డి వర్సెస్‌ వెలమ అన్నది కొన్ని ప్రాంతాలకు మాత్రం పరిమితం అయ్యింది. ఇక ఏపీలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో సామాజికవర్గ ఆధిపత్యం కొనసాగుతోంది. కోస్తాలో కమ్మ సామాజికవర్గం, సీమలో రెడ్లు, ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో కాపులు ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. ఏపీ రాజీకీయం ఇప్పుడు ప్రధానంగా మూడు అగ్ర సామాజికవర్గాల మధ్య నలుగుతోంది. కమ్మ, రెడ్డి, కాపు వర్గాలకు చెందిన నాయకులు మూడు ప్రధాన పార్టీలను లీడ్‌ చేస్తుండడంతో సహజంగానే కులాల ఉచ్చులో చిక్కుకున్న జనాలు ఈ ఎన్నికలను రంజుగా మార్చేశారు. ఇప్పుడు ఈ మూడు సామాజికవర్గాల ఓట్లు ఏ పార్టీకి ఎలా పడ్డాయ్‌ అన్న దానిపై గ్రౌండ్‌ రిపోర్ట్‌ పరిశీలిస్తే ఆసక్తికర అంశాలే వెల్లడవుతాయి. 

Image result for tdp-ycp-janasena logos

కమ్మ సామాజికవర్గానికి సంబంధించి 100కి 90-95% ఓట్లు తెలుగుదేశానికే వేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ఈ సామాజికవర్గంలో వ్యతిరేకించిన కొన్ని వర్గాలు సైతం ఈ సారి చంద్రబాబుకే ఓటు వేసినట్టు తెలుస్తోంది.ఈ సారి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం... ఈ సారి పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ భవిష్యత్తుతో పాటు సామాజికవర్గ ఉనికికే ప్రమాదమని భవించిన ఆ సామాజికవర్గం నేతలు, విదేశాల్లో ఉన్న వారు సైతం ఏపీకి వచ్చి వారితో పాటు వారి మీద ఆధారపడిన వారితో సైతం టీడీపీకి ఓట్లు వేయించిన పరిస్థితి కనపడింది. ఇక రెడ్డి సామాజికవర్గం కూడా చావో రేవో అన్నట్టు పోరాడింది. ఇప్నటికే తెలంగాణలో రాజీకీయంగా పదేళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిన ఈ సామాజికవర్గం ఇటు ఏపీలోనూ సంకట పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ సారి గెలవకపోతే తెలుగు రాష్ట్రాల్లో తమ సామాజికవర్గం రాజకీయంగా పూర్తిగా వెనకపడిపోతుందని భావించిన ఈ సామాజికవర్గంలో 90% ఓటర్లు వైసీపీకే పట్టం కట్టారు. ఇక వైసీపీ అధినేత జగన్‌ ఏకంగా 14 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సారి ఎలాగైనా జగన్‌ను గెలిపించి సీఎం చేసుకోవడంతో పాటు ఏపీపై తమ సామాజికవర్గ ఆధిపత్యం కోసం కసితో పని చేశారు. 

Image result for chandrababu-pavan-jagan

ఇక ఏపీలో సంఖ్య పరంగా బలంగా ఉన్న మూడో ప్రధాన సామాజికవర్గం కాపులు. ఈ సామాజికవర్గం ఒక్కో సారి ఒక్కో పార్టీకి మద్దతు తెలుపుతూ వస్తుంది. 1999లో కమ్మ+కాపు కాంబినేషన్‌తో చంద్రబాబు రెండో సారి అధికారంలోకి వచ్చారు. 2004లో కాపు+రెడ్డి కాంబినేషన్‌ వైఎస్‌కు కలిసి వచ్చింది. 2009లో ఎక్కువగా ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపిన ఈ సామాజికవర్గం గత ఎన్నికల్లో తిరిగి చంద్రబాబుకు బలంగా సపోర్ట్‌ చెయ్యడంతోనే చంద్రబాబు నవ్యాంద్ర తొలి సీఎం అయ్యారు. ఈ  ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి చెందిన సినిమా హీరో పవన్‌ కళ్యాణ్‌ జనసేన నంచి రంగంలో ఉండడంతో మెజారిటీ వర్గం ఓటర్లు జనసేనకే ఓటు వేశారు. ఈ సామాజికవర్గంలో ఉన్న యువత 90-95% వరకు జనసేన వైపే నిలిచారు. ఈ సామాజికవర్గంలో కాపులు పవన్‌ కళ్యాణ్‌ను మాత్రమే తమ నేతగా చూశారు. ఇక 40 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిలో చాలా మంది వైసీపీ వైపు మొగ్గు చూపగా మరి కొందరు టీడీపీకి ఓట్లు వేశారు. ఇదే సామాజికవర్గం ఓట్ల విషయంలో తెలుగుదేశం వెర్షన్‌ మరోలా ఉంది. భవిష్యత్తుపై ఆశలు ఉన్నవారు, ఉన్నత విద్యావంతులు మాకే ఓట్లు వేశారని ఆ పార్టీ ధీమాతో ఉంది. ఏదేమైన మూడు ప్రధాన సామాజికవర్గాల ఓటింగ్‌ను మూడు ప్రధాన పార్టీలు కొల్లకొట్టాయి. ఒకటి, రెండు శాతం కాస్త అటూ ఇటూ అయినా ఈ మూడు వర్గాలలో మెజారిటీ ఓటర్లు కులాన్ని చూసి ఓటు వేసినట్టు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: