తెలంగాణ ఇంట‌ర్ ఫలితాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.  విద్యార్థుల మార్కుల జాబితాల్లో చోటు చేసుకున్న తప్పులను సరిదిద్దే చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల్లో చోటు చేసుకున్న తప్పులు ఒక్కటొక్కటిగా బయట పడుతుండ‌ట‌మే దీనికి నిద‌ర్శ‌నం.బోర్డు అధికారుల నిర్వాకంవల్ల అత్యంత ప్రతిభగల విద్యార్థులు సైతం అత్తెసరు మార్కులతో ఉత్తీర్ణులు కావడం, 95 శాతానికిపైగా మార్కులు సాధిస్తామన్న విద్యార్థులకు వారు పొందిన మార్కులకు బదులు జాబి తాల్లో ఏఎఫ్‌, ఏపీ వంటి కోడ్‌ భాషను ప్రచురించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో ఇంట‌ర్‌బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ప‌లువురు ఆందోళ‌న తెలిపారు.


ఇంట‌ర్ ఫలితాలు విడుదలైన రోజునే ఫలితాలలో కొందరు విద్యార్థుల మార్కులకు బదులు పీఎఫ్, ఏపీ అనే పదాలు కనిపించగా విద్యార్థులు ఆందోళన పడ్డారు. తప్పులను సరిచేసి మార్క్స్ మెమోలను కాలేజీకి పంపిస్తామని బోర్డ్ వెల్లడించింది. అయితే, ఏకంగా 500 మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ మార్క్స్ వేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదురు రోడ్డు మీద శ‌నివారం ఆందోళనకు దిగారు.


గతంలో ఎన్నడూ ఇంటర్ బోర్డు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం ముందు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను విద్యార్థుల తల్లిదండ్రులు ఘెరావ్‌ చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై బోర్డు కార్యదర్శిని వారు నిలదీశారు. విద్యార్థుల మరణానికి కారణం కూడా మీరే కారణమంటూ ఆందోళన నిర్వహించారు. పేపర్లు దిద్దకుండానే ఇష్టమొచ్చినట్లు మార్కులు వేశారని వారు ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.


మ‌రోవైపు . ఏపీ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 12నే ప్రకటించారని తెలంగాణ ఫలితాలు ఎప్పుడిస్తారని విద్యార్థుల నుంచి ఒత్తిడి రావడంతో ఆదరాబాదరగా గురువారం సాయంత్రం ఫలితాలను ప్రకటించారన్న ఆరోపణలు ఉన్నాయి. పరీక్షలకు ముందు డేటాను సరైన పద్ధతిలో పొందుపరచకపోవడం, అనుభవంలేని సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతోనే సమస్యలు ఉత్పన్నమయ్యాయని తెలుస్తోంది. 30 ఏళ్ళ ఇంటర్‌బోర్డు చరిత్రలో ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షల్లో జరిగిన తప్పిదాలు మరెప్పుడూ జరగలేదని బోర్డులో పనిచేసిన విశ్రాంత అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: