``నేను సీఎం కాకుండా ఎవ‌రూ  ఆప‌లేరు`` అని ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ప్లేట్ మార్చేశారు. జ‌న‌సేన పార్టీ పెట్టింది సీట్ల కోసం కానే కాద‌ని...మార్పు కోస‌మని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఈ మార్పు ప‌య‌నం ఎక్క‌డి వ‌ర‌కు సాగుతుందో....త‌న‌కు తెలియ‌ద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇవ‌న్నీ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగిన యువ అభ్య‌ర్ధుల‌తో ముఖాముఖి స‌మావేశం సంద‌ర్భంగా జ‌రిగాయి.


పోలింగ్ సంద‌ర్బంగా అభ్య‌ర్ధుల‌కు ఎదురైన అనుభ‌వాల‌ను అడిగి తెలుసుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. "ఎన్నిక‌లు పూర్త‌యిన వెంట‌నే వైసీపీ మాకు 120 స్థానాలు వ‌స్తాయంటే, టీడీపీ మాకు ఇన్ని స్థానాలు వ‌స్తాయంటూ లెక్క‌లు వేయ‌డం మొద‌లుపెట్టాయి, మ‌నం మాత్రం అలా లెక్క‌లు వేయం. ఓటింగ్ స‌ర‌ళి ఎలా జ‌రిగిందో తెలుసుకోమ‌ని మాత్ర‌మే పార్టీ నాయ‌కుల‌కు చెప్పా. మార్పు చిన్న‌గానే మొద‌ల‌వుతుంది. ఇది మ‌నం ఎదిగే దశ. ఈ మార్పు ఎంత వ‌ర‌కు వెళ్తుందో తెలియ‌దు`` అంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.


నాయ‌కుల‌ను త‌యారు చేసేందుకు కృషి చేయాల‌ని ప‌వ‌న్ పార్టీ నేత‌ల‌కు తెలిపారు. ``నేను మిమ్మ‌ల్ని గుర్తించిన విధంగానే మీరు గ్రామ స్థాయి నుంచి నాయ‌కుల్ని  గుర్తించండి. నాయ‌కుల్ని త‌యారుచేయండి. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇదే మార్పును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్దాం. తెలంగాణ‌లో కూడా ఇదే త‌ర‌హా మార్పును ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారు.`` అని తెలిపారు. త‌న ప‌య‌నం గురించి ప‌వ‌న్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ``అంతా స‌మాజాన్ని మార్చాల‌నుకుంటారు. కానీ ముంద‌డుగు వేసే వారు త‌క్కువ‌. ముందుకు వెళ్దామంటే స్నేహితులు, సొంత వారే మ‌ద్ద‌తు ఇవ్వ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్ని అధిగ‌మించి ఓ ముంద‌డుగు వేశాం. నిధులు, నియామ‌కాల వ్య‌వ‌హారంలో తేడా వ‌చ్చిన‌ప్పుడే ఉద్య‌మాలు పుడ‌తాయి. తెలంగాణ ఉద్య‌మం కూడా అలా పుట్టిందే. ప్ర‌తి చోటా రెండు కుటుంబాలే అంతా ఆప‌రేట్ చేస్తూ వ‌స్తున్నాయి. ఎవ‌రికి నిధులు వెళ్లాలి, నీరు ఎవ‌రికి వెళ్లాలి అనే విష‌యం కూడా వారే ఆప‌రేట్ చేస్తున్నారు. అదే అంశం మీద ఫైట్ చేద్దామ‌నిపించింది. `` అని తెలిపారు. 
మనస్ఫూర్తిగా, నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు మన పార్టీ  చెప్పే నిజమైన కృతజ్ఞత అవుతుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం దిశగా పని చేయాలని చెప్పారు. రాజ‌కీయాల్లో మార్పు మొద‌లైంది... ఈ ప్ర‌కియను ఇలాగే కొన‌సాగిద్దాం అని  పిలుపునిచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: