ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఓట‌మి ఖాయ‌మ‌ని స‌ర్వత్రా ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో...ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో తొలుత ఈవీఎంలపై చర్చించారు. రాత్రి 8 గంటల నుంచి నియోజకవర్గాల వారీగా అభ్యర్థులతో సమావేశమై పోలింగ్‌ సరళి, బూత్‌ల వారీగా వచ్చే అవకాశం ఉన్న ఓట్లు, పోలింగ్‌ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు విశ్లేషణ జరిపారు. ఈ సంద‌ర్భంగా ఓట‌మికి సంబంధించిన చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.


ఈ స‌మీక్ష‌లో పార్టీ నేత‌ల‌పై చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు, ముఖ్య నేతలు దిగువస్థాయి నేతలను కలుపుకువెళ్ళడంలో విఫలమయ్యారని చంద్రబాబు మండిప‌డ్డారు. అదే విధంగా మరికొందరు పార్టీలోనే ఉంటూ పరోక్షంగా వైకాపాకు సహకరించారని ఆరోపించారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు తనవద్ద ఉన్నాయని , పార్టీకి ధ్రోహం చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. త‌ద్వారా పార్టీ ఓట‌మికి నేత‌లే కార‌ణ‌మ‌నే కామెంట్ల‌ను ఇప్ప‌టి నుంచే సిద్ధం చేశారు.


మ‌రోవైపు,  గంటల తరబడి క్యూలైన్‌లో ఉండి ఓట్లు వేసినవారందరికి కృతజ్ఞతలు తెలపాలని నియోజకవర్గాలవారీగా మంగళవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల అవసరాలను తీర్చే బాధ్యత మనపై ఉందని వారికి సూచించారు. ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని దీనికి అందరు సర్వసన్నద్దంగా ఉండాలని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: