రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసి రెండు వారాలు పూర్త‌య్యాయి. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు ఎంత తీవ్ర‌మైన ఉత్కంఠ కొన సాగిందో.. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడ‌తారు? ఎవ‌రు అధికా రంలోకి వ‌స్తారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఎక్క‌డిక‌క్క‌డ జ‌రిగిపోయిన ఎన్నిక‌ల విష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఈ క్ర‌మంలోనే క‌డ‌ప జిల్లాలోనే అత్యంత కీల‌క‌మైన మైదుకూరు నియోజక‌వ‌ర్గంలో ఎవ‌రు గెలుపు గుర్రం ఎక్కుతారు? ఎవ‌రికి ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తారు?  ఎవ‌రు ఎమ్మెల్యేగా విజయం సాదిస్తారు? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. 


నిజానికి ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించేందుకు టీడీపీ త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్ తీవ్రంగా కృషి చేశారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో తీవ్రంగా శ్ర‌మించి ఓడిపోయిన ఆయ‌న ఈదఫా ఎట్టిప‌రిస్థితిలోనూ గెలిచి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకుని మ‌రీ ప‌నిచేశారు. నిజానికి ఇక్క‌డ పుట్టాను త‌ప్పించి, మాజీ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లుమార్లు గెలుపు గుర్రం ఎక్కిన సీనియ‌ర్ నాయ‌కుడు డీఎల్ ర‌వీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకుని ఆయ‌న‌కు టికెట్ ఇచ్చి గెలిపించుకోవాల‌ని చంద్ర‌బాబు భావిచారు అయితే, పుట్టా ప‌ట్టుబ‌ట్ట‌డంతో డీఎల్‌ను పార్టీలోకి తీసుకోకుండానే పుట్టాకు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన శెట్టిప‌ల్లి ర‌ఘురామిరెడ్డికే జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. 


మ‌రోవైపు ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుకు పుట్టా వియ్యంకుడు కావ‌డం, అటు తెలంగాణ మంత్రి త‌ల‌సానికి కూడా వియ్యంకుడు కావ‌డం... త‌ల‌సాని ప‌దే ప‌దే చంద్ర‌బాబును టార్గెట్ చేస్తుండ‌డంతో తీవ్ర‌మైన ఒత్తిళ్ల మ‌ధ్య అయిష్టంగానే చంద్ర‌బాబు పుట్టాకు సీటు ఇచ్చారు. అయితే ఇప్పుడు బాబు వేసిన ప్లాన్లు అని మ‌రోసారి మైదుకూరులో ప‌నిచేయ‌లేద‌ని పోలింగ్ చెప్పేసింది. అక్క‌డ పుట్టా వ‌ర్సెస్ శెట్టిప‌ల్లి హోరా హోరీ ఎన్నిక‌ల పోరు సాగింది. ప్ర‌చారం నుంచి ఎన్నిక‌ల పోలింగ్ వ‌ర‌కు కూడా భారీ ఎత్తున ఈ ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డ్డారు. పుట్టా భారీ ఎత్తున ఖ‌ర్చు కూడా చేశార‌ని స‌మాచారం. అయితే, ఇక్క‌డే ఈ ఇద్ద‌రు నాయ‌కులు తెర‌మీద పోట్టాడుతుంటే.. తెర‌వెనుక డీఎల్ స‌హా కొన్ని రాజ‌కీయ శ‌క్తులు టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన ప‌రిస్థితి క‌నిపించింది. 


త‌న‌ను పార్టీలోకి తీసుకుంటాన‌ని చంద్ర‌బాబు అవ‌మానించార‌నే వ్యాఖ్య‌లు ఎన్నిక‌లకు ముందు డీఎల్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల వేళ‌.. త‌న వర్గం వారితో చ‌ర్చ‌లుజ‌రిపి మ‌రీ.. నిర్ణ‌యాత్మ‌క మార్పు కావాల‌ని ప్ర‌చారం చేశారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫునే గ‌తంలో రెండు సార్లు గెలిచిన శెట్టిప‌ల్లి.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలో చేరి విజ‌యం సాధిం చారు. అయితే, పుట్టా అంటే గిట్ట‌ని కొంద‌రు టీడీపీ కీల‌క నేత‌ల‌ను ఈయ‌న లోపాయికారీగా స‌హ‌కారం అందించేలా చ‌క్రం తిప్పారు. దీంతో ఇక్క‌డ మ‌రోసారి టీడీపీ ఓట‌మి, వైసీపీ గెలుపు ఖాయ‌మ‌ని అంటున్నారు. దీంతో ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌రికి ఓటేశారు? ఎవ‌రు ఎక్క‌డ నుంచి గెలుస్తున్నారు? అనే విష‌యాలు చాలా చ‌ర్చ‌నీయాంశంగా మార‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: